హైదరాబాద్, ఆగస్టు 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 4 కోట్ల మంది శాశ్వత అంధత్వంతో సతమతమవుతున్నారు. అయితే, పుట్టుకతో అంధత్వం వచ్చిన వారి నుంచి, ప్రమాదవశాత్తు చూపు కోల్పోయిన వారి వరకూ.. ఎలాంటి తీవ్రమైన కంటి చూపు సమస్య అయినా సరే శాశ్వత పరిష్కారం ఇచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. అంధులు లేని ప్రపంచాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ ఓ సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. అదే.. విజన్ ఇంప్లాంట్ చిప్.
ఈ చిప్ పనితీరు తెలుసుకొనే ముందు.. మనం ఎలా చూడగలుగుతున్నామో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏదైనా వస్తువును చూసిన కంటిలోని రెటీనా ఆ దృశ్యం తాలూకు సమాచారాన్ని ఆప్టికల్ నాడి ద్వారా మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు పంపిస్తుంది. మెదడు స్పందించిన తీరు, ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని బట్టి మనం ఆయా దృశ్యాలను చూసి అనుగుణంగా స్పందిస్తున్నాం. అయితే, అంధుల్లో కంటి రెటీనా, ఆప్టికల్ నాడీ వంటి కీలక భాగాలు పనిచేయకుండా పోతాయి. దీంతో మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు సమాచారం అందదు. ఫలితంగా వాళ్లు దేన్నీ చూడలేరు. దీనికి పరిష్కారంగా తీసుకొచ్చిందే విజన్ ఇంప్లాంట్ చిప్. దీన్ని మెదడులో అమర్చుతారు. ఇది రెటీనా, ఆప్టికల్ నాడిగా పని చేసి దృశ్యాల సమాచారాన్ని విజువల్ కార్టెక్స్‌కు డైరెక్టుగా చేరవేస్తుంది. అలా అంధులు ప్రపంచంలోని దృశ్యాలను చూడగలరు.
విజన్ ఇంప్లాంట్ చిప్ మెదడులో ఉంటుంది కాబట్టి బాహ్య దృశ్యాలను నేరుగా చూడలేదు. కాబట్టి, అంధులు ప్రత్యేకమైన రికార్డింగ్ కండ్లజోడు లేదా హెడ్సెట్ లాంటి ఓ డివైజ్‌ను ధరించాల్సి ఉంటుంది. ఆ డివైజ్‌ల ద్వారా రికార్డయ్యే విజనరీ ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నల్స్.. నేరుగా విజన్ ఇంప్లాంట్ చిప్‌కు చేరుతాయి. అక్కడి నుంచి విజువల్ కార్టెక్స్‌కు అందుతాయి. అలా అంధులు కండ్లు లేనప్పటికీ, కంటిచూపును తిరిగి పొందుతారు.
సాధారణ కంటికి కనిపించనటువంటి అల్ట్రా-హెచ్డీ రిజల్యూషన్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావయోలెట్, రాడార్ సిగ్నల్స్‌ను కూడా విజన్ ఇంప్లాంట్ చిప్ సాయంతో చూడొచ్చని మస్క్ తెలిపారు. అలా ఈ చిప్‌తో మనుషులు ఒకరకంగా ‘సూపర్ హ్యూమన్’ విజన్‌ను పొందుతారని పేర్కొన్నారు.
వచ్చే 6 నుంచి 12 నెలల్లో విజన్ ఇంప్లాంట్ చిప్ అందుబాటులోకి రానున్నట్టు మస్క్ ప్రకటించారు. మనుషులపై ప్రయోగాలు చేయడానికి అమెరికా రెగ్యులేటరీ కూడా అనుమతులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.