Palamuru | పాలమూరు.. ఒకనాటి వెనుకబడిన జిల్లా. పొట్ట చేతబట్టుకొని వలసపోయిన జిల్లా. జీవనదులు పారుతున్నా.. పొలాలు బీడుపడిన దృశ్యం.. సుదీర్ఘ కృష్ణా తీరం ఉన్నా.. గంజి కేంద్రాలే దిక్కయిన దైన్యం. పాలకుల వివక్షతో దుర్భిక్ష నేలగా మారిన పాలమూరు తలరాతను కేసీఆర్ మార్చారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేశారు. నదీజలాలను పొలాలకు మళ్లించారు. పడావు భూములను పసిడిసిరులు పండించేలా చేశారు. పాలమూరును పచ్చని పొలాలమూరుగా మార్చారు.
కాంగ్రెస్ రాకతో పాలమూరు పరిస్థితి తారుమారైంది. రెండేండ్లలో అరాచకాలు, ఆకృత్యాలకు నెలవుగా మారింది. పొలాల్లో నెత్తురు చిందుతున్నది. పల్లెల్లో ఫ్యాక్షనిజం పడగ విప్పుతున్నది. కుల విద్వేషం హెచ్చరిల్లుతున్నది. దళితులపై దాడులు, బడుగులపై దాష్టీకాలు, గిరిజనులపై దౌర్జన్యాలు, బిగ్‌బ్రదర్స్ అరాచకాలు, రాజకీయ కార్పణ్యాలు.. ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి.
సీఎం సొంత జిల్లా అంటే శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉండాలి. రాజకీయ సహనంతో ఉండాలి. అభివృద్ధికి సంకేతంలా ఉండాలి. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాలి. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు అదుపుతప్పిన అరాజకీయానికీ, అఘాయిత్యాల అరాచకానికీ మధ్య నలుగుతుండటం విచారకరం. విషాదకరం.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచకపర్వం కొనసాగుతున్నది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనకాండ, కులవిద్వేషపు ఘటనలతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న జిల్లా రెండేండ్లుగా భయాందోళన మధ్య బతుకీడుస్తున్నది. తన తలరాత మార్చుకుని పంటల సాగుతో మెరిసిన పాలమూరు ప్రగతికి.. ఇప్పుడు వరుస ఘటనలు నెత్తురు పులుముతున్నాయి. అన్ని ఘటనల్లోనూ సామాన్యులే సమిధలుగా మారుతున్నారు. అధికారం అండ చూసుకుని చెలరేగుతున్న మూకల చేతిలో బడుగుజీవులే బాధితులుగా మిగులుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఆ వేధింపులు, అవమానాల నుంచి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకూ మినహాయింపు లేదు.
ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలకూ లెక్కే లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో అధికార పార్టీ దౌర్జన్యకాండకు అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా శాసించడంతో పాటు ప్రతిపక్షమే లేకుం డా చేయాలనే కుతంత్రంతో సాగిస్తున్న దమనకాండ వెనుక ‘బిగ్ బ్రదర్స్’ ఉన్నారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ గూండాల వెన్ను తడుతూ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమను ఎదురించిన, ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ పోలీసుల సహకారంతో కేసులు పెడుతూ, వేధింపులకు గురిచేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాలమూరును పచ్చగా మార్చితే.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండేండ్లలోనే ఇక్కడ రక్తపుటేరులు పారిస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సొంత జిల్లాలోనే రైతులకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పొలాల్లో నాగలి పట్టి ఎవుసం చేసుకునే రైతులు చేతులకు బేడీలతో జైలు ఊచలు లెక్కించాల్సిన దుస్థితి వచ్చింది. ఇందుకు లగచర్ల ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేసిన ముఖ్యనేత, కుటుంబ సభ్యుల వ్యాపారం కోసం పేద రైతుల భూములపై కన్నేశారనే విమర్శలున్నాయి. బుక్కెడు బువ్వ పెట్టే భూములు గుంజుకుంటే తమ పరిస్థితేంటని ఎదురుతిరిగిన రైతులపై దుండగులు దాడులు చేశారు. తమ భూములు తమకే కావాలని ఎదిరించిన పాపానికి పోలీసు లాఠీలతో కొట్టించారు. జైలులో వేసి ఒల్లు హూనమయ్యేలా కొట్టించారు. ఇక రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. తమ భూములు లాక్కోవద్దన్నందుకు 45 మంది రైతులపై కేసులు బనాయించింది. రోడ్డు అవసరం లేకున్నా కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం సర్జఖాన్ పేట- తొగాపూర్ రైతుల భూములను బలవంతంగా లాకొని పంటలు నాశనం చేశారు. ఇదేం గుండాగిరీ అని ప్రశ్నించిన రైతులపై దాడులకు తెగబడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌లో అన్యాయానికి గురైన ఆ రైతులు కోర్టుకు వెళ్లగా వారికి న్యాయం దక్కింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ గూండాగిరీ, దౌర్జన్యకాండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిని అడ్డు తొలగించుకునేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ తప్పూ చేయకున్నా.. అధికారబలంతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ భూ పంచాయితీ విషయంలో నాగర్‌కర్నూల్ మండలం వనపట్ల, కుమ్మెర, నర్సాయిపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మన్యపు రెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. వీరు ముగ్గురు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్కు చెందిన మహిళా సర్పంచుల భర్తలు కావడం విశేషం. పోలీసు విధులకు ఆటంకం కలిగించాడన్న సాకుతో నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన పాలమూరు శివ అనే బీఆర్ఎస్ యువ నాయకుడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం, సాతాపూర్, చిన్న కార్పాముల, జొన్నలబొగుడ, మొల చింతలపల్లి, తీగలపల్లి, కోడేరులో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయించారు.
జొన్నలబొగుడలో మాజీ సర్పంచ్ రవి నాయక్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తే తిరిగి బాధిత రవి నాయక్‌పైనే కేసు పెట్టారు. సాతాపూర్‌లో మారెట్ కమిటీ డైరెక్టర్ పరమేశ్ ఇంటిపై దాడి చేసి కేసు పెట్టారు. చిన్న కార్పాములలో బీఆర్ఎస్ కార్యకర్త జగదీశ్‌పై దాడి చేయించి తప్పుడు కేసులు బనాయించారు. మొల చింతలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌పై దాడి చేసి అతడిపైనే కేసు పెట్టారు. చింతలపల్లిలో బీఆర్ఎస్ లీడర్ భార్య అంగన్వాడీ టీచర్‌ను డిస్మిస్ చేశారు. కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు భాసర్ రెడ్డిపై సివిల్ కేసు నమోదు చేయించారు. కోడేరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ యాదవ్‌పై అక్రమ కేసు బనాయించారు. లింగాలలో 2023లో జాతీయ ఉపాధి హామీ పథకంలో బినామీ పేర్లతో మస్టర్లు తయారుచేసి డబ్బులు కాజేశారని అప్పట్లో 8 మంది అధికారులపై కేసు నమోదు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేత, లింగాల మాజీ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య పేరును అందులో ఇరికించి అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే కారణంతో మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూ త్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్‌పై కాంగ్రెస్ నేతలు దాడిచేశారు.
బువ్వ పెట్టే భూములు లాక్కోవద్దన్న పాపానికి రైతులకు బేడీలు వేసి జైలు పాలు చేశారు.ముఖ్యనేత కుటుంబంపై బహిరంగ విమర్శలు చేశాడనే కోపంతో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్, ముఖ్యనేత సమీప బంధువు సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కట్టి అవమానించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే అక్కసుతో చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి (కొల్లాపూర్ అసెంబ్లీ)లో రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు. ఇది కాంగ్రెస్ గూండాల పనేనన్న ఆరోపణలున్నాయి.
కొండారెడ్డిపల్లిలో రైతులకు రుణమాఫీ జరిగిందో? లేదో? తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. దుశ్శాసన పర్వానికి తెరతీశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 45 మంది రైతులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారు.
సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రెండేండ్లుగా జరుగుతున్న అరాచక కాండ, హత్యారాజకీయాల పరంపరలో మచ్చుకు కొన్నే ఇవి!
ఉమ్మడి మహబూబ్‌నగర్ హత్యలు, అరాచకాలతో అట్టుడుకుతుంటే పోలీసులు కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ కీలు బొమ్మలుగా మారారనే విమర్శలున్నాయి. కండ్ల ముందే కాంగ్రెస్ గూండాల రౌడీయిజం కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనే వాదనలున్నాయి. తూముకుంటకు చెందిన రైతు రామకృష్ణారెడ్డిపై కాంగ్రెస్ గూండాలు హత్యాయత్నం చేస్తే వారిపై పిటీ కేసు పెట్టి వదిలేయడం పోలీసుల తీరుకు అద్దం పడుతున్నది.కోస్గి మండలం సర్జఖాన్ పేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటిని గ్రామ కాంగ్రెస్ నేత అక్రమంగా ఆక్రమించుకోడానికి వారి కుటుంబంపై దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా దాడి చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారనే విమర్శలున్నాయి.

జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగిన పలు గ్రామాల రైతులు

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై మాజీ సర్పంచ్ సాయిరెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారనే నెపంతో ఆయన ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ పెట్టడంతో ఇరుకు సందులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్తున్న బంధువులు

మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజీపై వెళ్లిన జర్నలిస్టు సరితపై దాడికి దిగుతున్న కాంగ్రెస్ మూకలు

శశిరెడ్డి మృతదేహాన్ని బైక్‌పై గద్వాలకు తీసుకెళ్తున్న దృశ్యం

కుమ్మెరలో కాంగ్రెస్ నేతల దాడిలో మృతి చెందిన పసిపాప మృతదేహంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద ధర్నా చేస్తున్న బాధితులు

