Umesh Yadav | టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టైమ్‌లో ఉమేశ్ యాదవ్ ఇంట్లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ చాలా నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజులు చికిత్స అందించారు. కానీ పరిస్థితి మెరుపడలేదు. రోజురోజూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో కాపర్ఖెడాలోని మిలన్ చౌక్‌లో నివాసానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు.
2010లో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమేశ్ యాదవ్.. పేసర్‌గా ఎదిగాడు. అయితే కొంతకాలంగా ఆయన టెస్ట్ క్రికెట్‌కే పరిమిమయ్యాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఉమేశ్ యాదవ్ తుది జట్టుకు ఎంపిక కాలేదు. కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు.