Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో (BJP) లో చేరడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా థరూర్ స్పందించారు.
అది ఆపరేషన్ సింధూర్ విజయాన్ని వివరించిన వ్యాసమని, అన్ని పార్టీల ఐక్యతను అది చెబుతోందని శశిథరూర్ అన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు బలపరుచుకోవడంలో ప్రధాని మోదీ శక్తి, చైతన్యం ప్రదర్శించారని తాను చెప్పానని తెలిపారు. ఇది బీజేపీ లేక కాంగ్రెస్ విదేశాంగ విధానాలకు సంబంధించినది కాదు, ఇది భారత విదేశాంగ విధానం గురించి మాత్రమేనని అన్నారు. తాను 11 ఏళ్ల క్రితం పార్లమెంటు విదేశాంగ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని గుర్తుచేశారు. తాను ఇలా మాట్లాడటం బీజేపీలో చేరడానికి సంకేతం కాదని, ఇది జాతీయ ఐక్యతకు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు.
శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం సోమవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా ఆ వ్యాసంలో థరూర్ అభిప్రాయాలు ఉండటం గమనార్హం. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత జరిగిన దౌత్యపరమైన కృషి జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువుగా పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్‌తో భారత్ దృఢమైన ప్రతిస్పందనను చాటి చెప్పిందని తెలిపారు. ఇది మన విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని వ్యాఖ్యానించారు.