హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : యూజీ, పీజీ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం-2020 రూపకల్పనను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వీసీలను ఆదేశించారు. శనివారం విశవిద్యాలయాల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో విద్యానాణ్యతను బలోపేతం చేయడంతోపాటు నాక్, నీఐఆర్ఎఫ్, ఎన్బీఏ, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్ వంటి గుర్తింపు, ర్యాంకింగ్ వ్యవస్థల్లో వర్సిటీలకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, ఎస్కే మహ్మద్, వీసీలు మొలుగారం, ప్రతాప్ రెడ్డి, యాదగిరి రావు, ఖాజా అల్తాఫ్ హుస్సేన్, శ్రీనివాస్, ఉమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాడల్ స్కూల్ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి
హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): పీవో 2018 ప్రకారం క్యాడర్ విభజనకు సర్కార్ అనుమతించిన నేపథ్యంలో మాడల్ స్కూల్ టీచర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు. ఉద్యోగోన్నతుల కోసం మాడల్ స్కూల్ ఉపాధ్యాయులు 12 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని శనివారం ప్రకటనలో గుర్తుచేశారు.