జరిగిన కథ
చిలుకవాడలో వామదేవుడు, పోటిసుడు అంతవరకు తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను పరస్పరం చెప్పుకొంటారు. పోదన నగరంలో లంకా దహనం నాటకం చివర్లో ఆంజనేయుని తోకకు నిప్పు అంటించినారు. ఆ మంటలు కుసుమ శ్రేష్ఠి భవనమంతటా వ్యాపించసాగినాయి. ఆ తర్వాత..
కళింగలో.. రాజాంతఃపురంలో.. ఒక సువిశాల మందిరంలో.. మహారాజు కళింగాదిత్యుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. అతను కనులు తెరిచిన తరువాత ఇచ్చే ఆదేశం కోసం ఎదురుచూస్తూ చేరువనే నిలబడి, నిరీక్షిస్తున్నాడు మంత్రి సురహివచ్చుడు. మరికొద్దిసేపటికి మహారాజు కనులు తెరిచినాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న సురహివచ్చుడు.. “ప్రభూ! ఆనతినీయండి!” అన్నాడు. “మంత్రి శేఖరా! చాలారోజులుగా ఒకే ప్రదేశంలో ఉండటం వలన విసుగు కలుగుతున్నది. వన విహారానికి వెళితే మనసు కొంచెం ఆహ్లాద భరితం అవుతుంది కదా!” అన్నాడు సాలోచనగా. సురహివచ్చుడికి ఏం జవాబు చెప్పవలెనో అర్థం కాలేదు. మింగమంటే కప్పకు కోపం; వదలమంటే పాముకు కోపం! అన్నట్లున్నది అతని పరిస్థితి. రాజు కళింగాదిత్యుడు; పాలన మాత్రం ఈసాణుడిది. అతను దూరపు బంధువు కావడంతో మొదట ఆంతరంగికుని పదవి, ఆపై మహామాత్య పదవి ఇచ్చి గౌరవించినాడు రాజు. ఆ తర్వాత బౌద్ధం పట్ల ఆకర్షితుడై పాలనను ఈసాణుడి నెత్తికెత్తి అత్యధిక సమయం ధ్యానంలో గడపడానికి అలవాటు పడ్డాడు.
అది వానికి అయాచిత వరమైంది. రాజుగారి నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ ఈసాణుడు క్రమక్రమంగా పాలనలోని ఒక్కో విభాగాన్ని హస్తగతం చేసుకున్నాడు. మహారాణి ఖరహరప్రియ ఈసాణుడి దుర్మార్గం కనిపెట్టి కోశాగారం అతని వశం కాకుండా కాపాడింది. తేలు కుట్టిన దొంగలా ఈసాణుడు ఆ విషయం తెలియనట్లే నటిస్తూ ఇతర మార్గాల నుండి ధనం రాబట్టుకోవడానికి అలవాటు పడ్డాడు. శత్రుభయం లేని రాజ్యం కావడంతో సైన్యాన్ని పెంచుకోవలసిన అవసరం లేదు కానీ అతని విలాసాలకు, విచ్చలవిడి ఖర్చులకు చాలా ధనం కావలసి వస్తున్నది. అందుకే కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ దోపిడీకి తెగబడుతున్నాడు. ఇప్పుడు తానే రాజు అయితే తిరుగుండదు అన్న నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. మహారాణిని, రాజును వేర్వేరుగా గృహనిర్బంధంలో ఉంచి సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. అతని అనుమతి లేకుండా చీమ కూడా కదలరాదన్న ఆజ్ఞను ఆచరణలో పెడుతున్నాడు. రాజుగారు బయటికి వెళ్లాలంటున్నారు; ఈసాణుడి అనుమతి లేకుండా ఏమీ చేయలేని స్థితి. అతను ఇటువంటి వాటిని అంగీకరించడని తెలిసి కూడా అడగడం అర్థరహితం. అందుకే రాజు గారి మాటను అవుననలేక..
కాదనలేక సతమతమవుతున్నాడు సురహివచ్చుడు. “ఏమది అమాత్యా! మాట్లాడవు?” తన మాటకు వెంటనే సమాధానం రాకపోవడం ఆశ్చర్యపరచింది కళింగాదిత్యుడిని. “అతను మాట్లాడలేడు మహారాజా! నేను మాట్లాడుతాను” అప్పుడే మందిరంలోకి ప్రవేశిస్తూ అన్నాడు ఈసాణుడు. అది రాజును మరింత అయోమయంలోకి తోసింది. “అదేమి?” అన్నాడు అర్థంకాక. “ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండటం క్షేమకరం కాదని, నేనే ఈ శాసనం చేయించినాను!” గంభీరంగా అంటూ.. రాజు పక్కనగల ఆసనంలో ఆసీనుడైనాడు ఈసాణుడు. మరింతగా చకితుడైనాడు కళింగాదిత్యుడు. “అదేమి మహామాత్యా! అంతా అయోమయంగా మాట్లాడుతున్నావు! నీ మాటలు, నీ ప్రవర్తన ఏమాత్రమూ అవగతం కావడం లేదు! ఆక్షేపణీయముగా ఉన్నాయి” అన్నాడు కోపాన్ని దిగమింగుకుంటూ. “తమ అయోమయాన్ని తొలగించుటకే నేను వచ్చినాను కళింగాదిత్యా!” అన్నాడు ఈసాణుడు. ఆ సంబోధనకు ఉలిక్కిపడ్డాడు సురహివచ్చుడు.
“ఏమిటీ అమర్యాద?” ఆగ్రహ వశుడైనాడు మహారాజు. “కర్ర గలిగిన వాడే గొర్రెలకాపరి! రాజదండం గలిగిన వాడే మహారాజు! తమ వద్ద ఖడ్గం లేదు! దండం లేదు! మేము దయదలిస్తే కమండలం ప్రసాదించగలం! తమరు హద్దు మీరితే దండనా విధించగలం..!” కళింగాదిత్యుని మొఖం కోపంతో కందగడ్డలా మారింది. ఏదో అనబోతున్న అతణ్ని చేతి సైగతో ఆపి, సాహంకారంగా తన ప్రసంగాన్ని కొనసాగించినాడు ఈసాణుడు. “రాజులేని రాజ్యము గౌరవ పూజ్యము కదా ఆదిత్యా! నీ అలసత్వం, శౌర్యహీనత, శాంతిమంత్ర పఠనము.. రాజ్య పతనానికి దారులు వేయిచున్నదని; ఈ రాజ్యమును, రాజు రమణి ఖరహరప్రియను కాపాడుటకై ఒక శౌర్యధనుడు కావలసి ఉన్నది. ఆ శౌర్య ధనుడను నేనే కావలసి వచ్చినది. తమరు అత్యుత్సాహం చూపినా.. అది ప్రాణాంతం అగునని గ్రహించడం మంచిది. ప్రస్తుతం తమరు ఈ నాలుగు గోడలు దాటి ఎక్కడికీ వెళ్లలేరు! మెడకాయ మీద తలకాయ ఉండవలెననుకొను వాడెవడూ మీకు సహాయ మొనర్చడు. ఇది రాజాజ్ఞ! ఈ ఈసాణ చక్రవర్తి శాసనం! కాదన్నవాడు కాలుని సదనములో ఉండును!” అని హెచ్చరిస్తూ.. అక్కడినుండి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లినాడు ఈసాణుడు. అక్కడున్న భటులు, పరిచారకులు, మంత్రి సురహివచ్చునితోసహా తలలు వంచి అతనికి నమస్కరించడం జీర్ణించుకోలేక పోయినాడు నామమాత్రుడైన కళింగాదిత్య మహారాజు.
“ఏమీ.. పిచ్చి పట్టిందా?” నమ్మలేనట్లు అన్నది రాయహత్థి. ‘పదహారేళ్ల పడుచు; దేన్నయినా తట్టుకోగలిగే శక్తియుక్తులు గల ధీర వనిత చంద్రహత్థికి పిచ్చి పట్టడమేమిటి? ఇది ఏమాత్రమూ నమ్మదగిన సంగతి కాదు! నిజం ఎంత మాత్రమూ కాదు!’ అనుకుంటూ ఆ మాటన్న మనిషిని చిత్రంగా చూసింది. “పిచ్చికాదు వదినా! పిచ్చిపిచ్చిగా చేస్తున్నది. ఏదో గాలి సోకిందని అనుకుంటున్నారు అందరూ. నేనుకూడా ఈ మాట నమ్మలేదు. చూస్తే నీవు కూడా నమ్ముతావు. రా! తొందరగా..” అన్నది చంద్రహత్థి వాళ్ల పొరుగింటి మనిషి.. మంగళ. పరుగు పరుగున చంద్రహత్థి ఇంటికి చేరిన రాయహత్థి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. ఒంటి మీద ఉన్న వస్ర్తాలు జారిపోతున్నా పట్టించుకోకుండా అర్థంపర్థం లేని పాటలేవో పాడుతున్నది చంద్రహత్థి. ఆమెతల్లి ఉల్లోలహత్థి ఆ పిల్లను అదుపు చేయడానికి కిందామీదా పడుతున్నది. సాయం చేయలేక తండ్రి సతమతమవుతున్నాడు. ఊరివాళ్లు చాలామంది అక్కడ గుమిగూడి వినోదం చూస్తున్నారు. ఎవరికి తోచిన కథలు వాళ్లల్లుకొని గుసగుసలాడుకుంటున్నారు.
ఇంకా ఆ దృశ్యం చూస్తూ ఉండలేక చంద్రహత్థి వద్దకు చేరుకున్నది రాయహత్థి. రాయహత్థిని గుర్తించింది చంద్రహత్థి. అందరూ విస్తుపోయినారు. అంతవరకూ ఎవరినీ పోల్చుకోలేని చంద్రహత్థి ఆమెను గుర్తించి పలకరించింది. రాయహత్థికి దుఃఖం ఆగలేదు. చంద్రహత్థి ఆమెను గట్టిగా వాటేసుకొని బిగ్గరగా ఏడవ సాగింది. కొన్నిక్షణాల తర్వాత దుఃఖం దిగమింగుకొని.. ఉల్లోలహత్థితో ఈ విధంగా అన్నది రాయహత్థి. ఎందుకమ్మ కలత ? ఏ గాలి సోకలే దామె మనసు కాలెనేమొ చూడు! పిడుగుపాటు వలన బెదిరెనేమో! లేక ప్రియుని గానలేని వెరపు వలనొ! (అమ్మా! ఎందుకంత ఆందోళన పడుతున్నావు? ఆమెకు ఏ గాలీ సోకలేదు. పిడుగుపాటు వంటి సంఘటనతోనో; ప్రియుని ఎడబాటు అనే బెంగతోనో ఆమె మనసు కాలిపోయినట్లున్నది)” అంటూ అక్కడ చేరిన వాళ్లందరితో.. “చూడండి! మీరనుకుంటున్నట్లు ఆమెకు ఏ దయ్యం పట్టలేదు. మీరు ఇక్కడ ఏదో వేడుక చూస్తున్నట్లు గుమిగూడటం బాగాలేదు. పోయి మీమీ పనులు చూసుకోండి!” అంటూ అదిలించింది.
రాయహత్థి మాటలతో అక్కడ చేరిన వాళ్లందరూ ఒక్కొక్కరే నెమ్మది నెమ్మదిగా వెళ్లిపోయినారు. తర్వాత.. “చంద్రా! నీకేమీ కాలేదు! ఏమీకాదు!” అని గుండెకు గట్టిగా హత్తుకొని వీపు నిమిరింది. చంద్రహత్థి దుఃఖం క్రమంగా వెక్కిళ్లలోకి మారి, ఉపశమించింది.రాయహత్థి ఆమెను మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తోడుకొని పోయింది. “గుణ మందియుని పిలిపించండి. ఆయన తగిన వైద్యం చేయగలడు. అనవసరంగా దయ్యం పట్టిందని, పిచ్చిపట్టిందని దాన్ని మరింత కష్టపెట్టకండి!” మందలిస్తున్నట్లుగా ఉల్లోలహత్థితో అన్నది రాయహత్థి. “ఏం చేయను బిడ్డా! వారం రోజులుగా తిండిలేదు; నిద్రలేదు. చిక్కి బొమికెల గూడులా మారింది. కలవరింతలు ఇంతింత పెరిగి ఏడుపులు, శోకాలుగా మారినాయి. ఒంటిమీద ధ్యాస తగ్గిపోయింది. అర్ధరాత్రి, అపరాత్రి లేచి తలబాదుకుంటూ ఏమేమో మాట్లాడుతున్నది. ఎక్కడికో పోతానంటూ పరుగులు పెడుతున్నది. ఇదంతా గాలి, ధూళి సోకిన లక్షణాలేనని వారం రోజులనాడు మంత్రగాళ్ల వద్దకు తోడుకొని పోయినాం. వాళ్లు దయ్యం వదిలిస్తామని బిడ్డ ఒళ్లు హూనమయ్యేటట్లు..” ఆపై దుఃఖంతో మాట్లాడలేకపోయింది ఉల్లోలహత్థి.వాళ్లు వారం రోజులుగా ఊళ్లో లేకపోవడానికి కారణం అర్థమైంది రాయహత్థికి.
‘ఆ మంత్రగాళ్ల వద్దకు పోవడానికి బదులు నా వద్దకు వచ్చి ఉంటే, పిల్ల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కదా!’ అని మనసులో అనుకున్నది. అంతలో చంద్రహత్థి తండ్రి సిరివగ్గు వైద్య శిఖామణి గుణ మందియుని తోడుకొని వచ్చినాడు. చంద్రహత్థి చేయిపట్టి, నాడిని పరిశీలించినాడు గుణ మందియుడు; కన్నులు చూసినాడు; తలమీద చేయి పెట్టి ఏవో లెక్కలు కట్టినాడు. “శరీర సంబంధమైన జబ్బు ఏమీలేదు ఈ పిల్లకు కానీ..” అంటుండగానే ఉల్లోలహత్థి అందుకున్నది. “నేను అదే చెప్తున్న సామీ! వీళ్లకు తలకెక్కడం లేదు. ఇది గాలి సోకుడే.. కానీ ఆ మంత్రగాళ్లు కూడా అది తగ్గించలేకపోయినారు. ఏదో అంతుచిక్కని సోకుడు దీన్ని పీడిస్తున్నట్లు ఉన్నది. ఇది తగ్గేటట్లు లేదు.. నా బిడ్డ అల్పాయుస్సు..” అంటుండగానే దుఃఖం కట్టలు తెంచుకొన్నది. అది రాగాలై పారసాగింది ఆమెకు తెలవకుండానే. భార్య ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చింది సిరివగ్గుకు.
“ముందు నీవు ఆ ఏడుపు ఆపితే మంచిది! లేనిపోనివన్నీ నీవే ఊహించుకొని గగ్గోలు పెడుతూ, మమ్ములను అందరినీ బెంబేలెత్తించకు! ముందా అయ్యవారు ఏం చెపుతారో మనసుపెట్టి పూర్తిగా విందాం!” అని గదమాయించినాడు. భర్త మాటలతో మారు మాట్లాడక నోరు మూసుకున్నది ఉల్లోలహత్థి. కొంచెంసేపు ఆలోచించి, ఈ విధంగా అన్నాడు గుణ మందియుడు.. “ఈ పిల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నది. అంటే మనసుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏదో విలువైన సంపదను పోగొట్టుకున్నట్లు ఉన్నది. కళ్లముందే తన సర్వస్వం పోగా , అది మళ్లీ దొరుకుతుందో లేదోనని ఆందోళన పడుతున్నది. ఇక తన జీవితమే వ్యర్థమన్న పరిస్థితికి చేరుకున్నది. ఏదో ఈ వయసులో ఉన్న పిల్లలకు..” అంటూ, ఇంకా ఏదో అనబోతూండగా, హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైనాడు కుటిలబుద్ధి గల కటిలుడు. “ఏయ్! ఏందిరా ఇట్లా వచ్చినావు ? అందరూ వెళ్లి పోయినారు గదా!” గబుక్కున లేచి దాడిచేస్తున్న చిరుతలా కటిలుని మీదికి ఉరికింది రాయహత్థి.
వాడు బాగా తాగి ఉన్నాడు. రాయహత్థి మాటలకు ఏమాత్రం జడియకుండా.. “అది నా పెళ్లాం వదినా! నేను లేకుండా అది ఉండగలదేమో గానీ, అది లేకుండా నేను ఉండలేను!” అన్నాడు మొండిగా. “మళ్లా దాన్ని పెళ్లాం అంటే.. నేనే నిన్ను పాతరేస్తా తాగుబోతు నా కొడకా!”అని కొట్టబోయింది. “వదినా! నువ్వు నన్ను కొట్టినా, చంపినా నేను చంద్రను వదలను! నన్ను పెళ్లి చేసుకోమను. దాని రోగం కుదురుతుంది. నా బతుకు బాగుపడుతుంది. తాగుడుతోపాటు అన్నీ మానేస్తా”.. ఇంకా ఏమేమో వాగుతున్నాడు. ఒక్కసారి తలెత్తి చూసినాడు సిరివగ్గు. ఆ చూపులో చురుకుదనం తట్టుకోలేక మెల్లగా జారుకున్నాడు కటిలుడు. ఇంతకు ముందొకసారి చంద్రహత్థి విషయంలో సిరివగ్గు చేతిలో తన్నులు తిన్న అనుభవం వాడెప్పుడూ మరచిపోలేదు మరి! ఈ మనిషికి, ఆ పిల్ల పరిస్థితికి ఏదో సంబంధం ఉన్నదేమో అనిపించింది గుణమందియునికి. ‘వీడే తనకు దక్కలేదని నా బిడ్డకు ఏదో చేతబడి లాంటిది చేయించినాడేమో!’ అనుకోగానే ఉల్లోలహత్థి గుండెలో కల్లోలం చెలరేగింది. జరుగుతున్నదేమీ అర్థంకాక, రాయహత్థి వైపు చూసినాడు గుణమందియుడు.