Rahul Gandhi : సీబీఎస్ఈ ఓఎస్ఎం అంశంపై ప్రశ్నించినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తనపై మాటల దాడి చేసినంత మాత్రాన ధర్మేంద్ర ప్రధాన్ చేసిన నేరాలు ఒప్పులైపోవని రాహుల్ గాంధీ విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ సహా, సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాహుల్ ప్రశ్నించారు.
ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పదేపదే రాహుల్ తనను టార్గెట్ చేసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాహుల్‌పై గట్టిగా విమర్శలు గుప్పించారు. రాజకీయాలు తర్వాత చేయొచ్చని, విద్యార్థులపై ఒత్తిడి పెంచేలా ప్రకటనలు చేయవద్దని కోరారు. ఇప్పటికే విద్యార్థులు మార్కులు, వెరిఫికేషన్, రీవాల్యూయేషన్ వంటి అంశాల్లో ఆందోళనతో ఉంటే, వారిని ఇంకా మానసిక ఒత్తిడికి గురి చేసేలా చేయడం తగదని రాహుల్‌కు సూచించారు. రాహుల్ సర్‌ను, ఈవీఎంలను, డిజిటల్ ఇండియాను విమర్శించారని, వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో నిరాశతో రాహుల్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మంత్రి అన్నారు. అయితే, దీనికి రాహుల్ ఘాటుగా స్పందించారు.
Dharmendra Pradhan ji, you can attack me all you want but it won’t absolve you of your crimes. Nor will it stop me from demanding answers for 18.5 lakh children.
Why was the CBSE OSM contract handed to COEMPT – a company already mired in controversy under its old name,… https://t.co/Xy8MbBTnTL
— Rahul Gandhi (@RahulGandhi) May 28, 2026
‘‘ధర్మేంద్ర.. మీరు నాపై ఎలాగైనా దాడి చేయొచ్చు. నాపై దాడి చేసినంత మాత్రాన మీరు చేసిన నేరాలు ఒప్పులైపోవు. 18.5 లక్షల మంది చిన్నారులకు సమాధానం చెప్పాలి అని నేను ప్రశ్నించకుండా ఉండలేను. సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్ట్‌ను గతంలో తప్పులు చేసిన సీఓఈఎంపీటీ సంస్థకు ఎందుకిచ్చారు..? ఈ సంస్థ చరిత్రను ఎందుకు తనిఖీ చేయలేదు. మోదీ ప్రభుత్వానికి. ఈ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి” అని రాహుల్ ప్రశ్నించారు. నిజంగా ప్రధాని దీనికి బాధ్యత తీసుకుని ఉంటే మోదీ మిమ్మల్ని ఎప్పుడో మంత్రి పదవి నుంచి తప్పించేవారు అని రాహుల్ అన్నారు. మరోవైపు అంతకుముందు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. సీబీఎస్ఈ ఓఎస్ఎంలో జరిగిన తప్పులకు తనదే బాధ్యత అని ప్రకటించారు.