Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్లకు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ బ్రాండ్ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందంటూ నమోదైన కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సల్మాన్, అల్విరాతో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, అక్టోబర్ 5న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఫిర్యాదు ప్రకారం, ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్‌ను మణిమజ్రా ప్రాంతంలో ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులు ప్రోత్సహించడంతో తాను సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో షోరూమ్ ఇంటీరియర్, డెవలప్మెంట్ పనులకే దాదాపు రూ.1 కోటి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.అయితే షోరూమ్ ప్రారంభమైన తర్వాత ఒప్పందంలో పేర్కొన్న విధంగా కంపెనీ నుంచి ఎలాంటి వ్యాపార సహకారం అందలేదని, 2020 ఫిబ్రవరి నుంచి నగలు, స్టాక్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. దీంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతిని చివరకు షోరూమ్‌ను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని కోర్టుకు వివరించారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దుస్తులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో పాటు జ్యువెలరీ విభాగంలో కూడా ఈ బ్రాండ్ విస్తరించింది. అయితే ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో మోసం జరిగిందన్న ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై గతంలో స్పందించిన సంబంధిత సంస్థ, 2018లో జరిగిన వ్యాపార ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ప్రత్యక్ష ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన అంశమని తెలిపింది. అయినప్పటికీ, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్లకు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగనుంది. ఆ రోజున సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్‌తో పాటు సంబంధిత సంస్థ ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరుకానున్నారు. విచారణ అనంతరం ఈ వ్యవహారంలో తదుపరి చట్టపరమైన చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.