Karnataka Techie : ఐటీ ఉద్యోగం వదిలేసి వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయం చేస్తున్నాడు. కానీ తన పంట చేనులో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరులోని మడికెరె పట్టణానికి చెందిన 43 ఏళ్ల మాజీ టెక్కీ రోషన్ బాలకృష్ణ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలేశాడు. వ్యవసాయం చేస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తన కుటుంబంతో కలిసి మైసూరులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు.
సాగునీటి ప్రణాళికల్లో భాగంగా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి మైసూరులోని తన పొలం చూసేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా తన భూమిలోని ఓ మామిడి చెట్టు పండ్లు కోయడానికి వెళ్లాడు. అదే సమయంలో భారీ వర్షంతోపాటు పిడుగులుపడ్డాయి. ఓ పిడుగు మామిడి చెట్టుపై పడటంతో రోషన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతుడి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.5 లక్షల పరిహారం ప్రకటించాయి.