INDW vs ENGW : ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ(75) అర్ధ శతకంతో పోరాడినా మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఓదార్పు విజయం సాధించింది. ఇప్పటికే మూడింటా గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆద్యంతం గొప్పగా రాణించి 10 వికెట్లు తీసిన తెలుగమ్మాయి శ్రీ చరణికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
నామమాత్రమైన ఐదో టీ20లో భారత మహిళల జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధాన(8) విఫలమైనా.. షఫాలీ వర్మ(75) అర్ధ శతకంతో మెరుపు ఆరంభం ఇచ్చింది. ఆమె జోరుతో భారీ స్కోర్ అందుకోవడం ఖాయమనిపించింది. కానీ, చార్లీ డీన్ టాపార్డర్‌ను కూల్చి పరుగుల వేగాన్ని అడ్డుకుంది. జెమీమా రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15), హర్లీన్ డియోల్(4) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగగా.. రీచా ఘోష్(24), రాధా యాదవ్(14 )ల పోరాటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది టీమిండియా.
Special ❓ Relentless❓ Memorable⁉️
How to describe #TeamIndia‘s first-ever T20I series win over England in England 🤔
Let’s hear it from the ones who made it possible 😃#ENGvIND pic.twitter.com/kWAwapomiU
— BCCI Women (@BCCIWomen) July 13, 2025
మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫీ డంక్లె (46), డానిల్ వ్యాట్ హొడ్గే(56)లు సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి గట్టి పునాది వేశారు. ఈ జోడీని రాధా యాదవ్ విడదీసినా.. కెప్టెన్ టమ్మీ బ్యూమంట్ (30), వికెట్ కీపర్ అమీ జోన్స్(10) దూకుడుగా ఆడడంతో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. పొట్టి సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు వన్డే సిరీస్‌లో భారత జట్టుకు షాక్ ఇవ్వాలనుకుంటోంది. ఇరుజట్ల మధ్య జూలై 16 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలు కానుంది.