సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐవోఎస్‌ల బదిలీల వివాదానికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. ‘కలెక్టర్ వర్సెస్ టీచర్లు’ శీర్షికతో ‘నమస్తే’ బుధవారం కథనం ప్రచురించింది. క్షేత్రస్థాయిలో పదో తరగతి విద్యార్థులు నష్టపోతున్నారంటూ.. పేర్కొంది. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ నుంచి బదిలీ అంశానికి సంబంధించిన వివరాలను తెప్పించుకుని పరిశీలించారు.
బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన టీచర్ల విజ్ఞప్తిని కలెక్టర్ అంగీరించినట్టు తెలిసింది. ఆరోపణలు లేని వారిని మళ్లీ పూర్వ ప్రాంతానికి బదిలీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీచర్లకు సమాచారం అందించినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో బదిలీ అంశం కారణంగా విద్యార్థులు నష్టపోవద్దని కలెక్టర్ భావించారు. ఆ మేరకు టీచర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని బదిలీ ప్రక్రియను పునః పరిశీలిస్తున్నట్టు ఓ విద్యాశాఖ అధికారి వివరించారు.