ఖమ్మం అర్బన్, ఆగస్టు 2 : వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్‌గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు రావడంతో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సస్పెండైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లో చేర్చుకునే విషయంలో మాత్రం రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడాలేని విధంగా తలతోక లేని నిబంధనలను అనుసరిస్తున్నారు.
ఏ కారణాలతో సస్పెండైన సదరు ఉపాధ్యాయులు రూ.20, రూ.50, రూ.100 బాండ్ పేపర్లను సమర్పించి విధుల్లో చేరాలని ఆదేశించడంతో చేసేదిలేక సదరు ఉపాధ్యాయులు బాండ్ పేపర్లు సమర్పించి తిరిగి విధుల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేసే ఒప్పంద, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంవత్సరం చివరలో రెన్యువల్ జరిగే సమయంలో బాండ్ పేపర్లు ఇవ్వడం పరిపాటి. కానీ రెగ్యులర్ ఉద్యోగులు కూడా సస్పెండై తిరిగి తమ విధుల్లో చేరుతున్న సమయంలో బాండ్ పేపర్లు ఇవ్వడం కొసమెరుపు. పేపర్ విధానానికి స్వస్తి పలికి ఈ-ఆఫీస్ విధానం అమలుచేస్తే దానిని మూలనపడేసి పేపర్ వర్క్ సాగిస్తున్నారు.
గత కొంతకాలం క్రితం వేంసూరు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు సివిల్ వివాదాల్లో తలదూర్చాడని వివాదాల్లోకెక్కగా సదరు ఉపాధ్యాయుడిని డిపార్ట్‌మెంట్‌పరంగా విచారణ నిమిత్తం సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ప్రైవేటు పాఠశాలలకు, ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వీడియోలు, రీల్స్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ సదరు మహిళా ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. మరో ఉపాధ్యాయుడు వ్యాపారం నిర్వహిస్తూ కేసు కావడంతో సస్పెండ్ చేశారు. నగరంలోని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విధుల నుంచి సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలా పలు కారణాలతో కొందరు ఉపాధ్యాయులు సస్పెండయ్యారు. ఏ ఉపాధ్యాయుడైనా కనీస సస్పెండ్ కాలం 6నెలలు కాగా కొందరు మాత్రం తమకున్న రాజకీయ, అధికారుల పలుకుబడితో లేదా ఇతర మార్గాల ద్వారా విధుల్లో చేరుతున్నారు.
ఇటీవల కాలంలో సస్పెండైన నలుగురు ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ కల్పించారు. వీరినుంచి మరోసారి తప్పు చేయమని పేర్కొంటూ బాండ్ పేపర్స్ సేకరించారు విద్యాశాఖాధికారులు. ఇక్కడివరకు బాగానే ఉన్నా కొందరికి కేటాయించిన స్థానాలపై మాత్రం పలు ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో సస్పెండైన టీచర్‌కు పనిషిమెంట్ కింద ఇంకో పాఠశాలకు పంపించాల్సి ఉండగా నగరంలోనే పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలలో అదే సబ్జెక్ట్‌కు మరో ఉపాధ్యాయురాలు ఉండగా రెండో ఉపాధ్యాయురాలిగా పంపడం విమర్శలకు తావిస్తోంది. బోనకల్ మండలంలోని పాఠశాలలో సస్పెండైన టీచర్‌కి కల్లూరు మండలంలో పోస్టింగ్ కల్పించారు. వేంసూర్లో సస్పెండైన టీచర్‌కు ఎర్రుపాలెం మండలంలో పోస్టింగ్ కల్పించారు. ఎర్రుపాలెంలో పోస్టింగ్ కల్పించిన టీచర్‌కు ఖమ్మంరూరల్ మండలంలోని పాఠశాల పేరు పేర్కొంటూ పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తుంది.
పరిపాలనా అంతా పేపర్ నుంచి ఈ-ఆఫీస్ విధానంలో మార్చారు. ఎప్పుడు ఫైళ్ళు వచ్చాయి, ఏ సమయంలో వాటిని పరిశీలించారు. ఎన్ని రోజులు ఏ అధికారి వద్ద ఉన్నాయి. డిజిటల్ సంతకాల నుంచి ప్రతిది పారదర్శకంగా ఉండే విధానం తీసుకొచ్చారు. ఈ పారదర్శకత మనకెందుకు అనుకున్నారో ఏమో కానీ జిల్లా విద్యాశాఖలో ఈ ఆఫీస్ విధానాన్ని పక్కన బెట్టారు. పెండింగ్ ఫైళ్లు డీఈవో చాంబర్లో చాలానే ఉన్నాయి. విద్యా సంవత్సరం మొదలై రెండునెలలు గడుస్తున్నా జిల్లా విద్యాశాఖకు పూర్తిస్థాయిలో బాస్ లేకపోవడంతో డిపార్ట్మెంటల్పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
గత సంవత్సరం కూడా పరిస్థితి ఇలానే ఉంటే జిల్లా అదనపు కలెక్టర్లు, డిప్యూటీ సీఈవోలు, ఇతర జిల్లాకు చెందిన డీఈవో జిల్లా విద్యాశాఖాధికారులుగా చార్జ్‌లు తీసుకున్నారు. ఇన్చార్జి ఉన్న డీఈవో చైతన్యజైనీ సెలవులో వెళ్లడంతో ఆపై వెంటనే జిల్లా డీఈవోగా రెవెన్యూ అధికారి సదానందంను నియమిస్తూ జిల్లా కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేయడంతో డీఈవోగా సదానందం బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డీఈవోగా బాధ్యతలు తీసుకోగా తనదైన ైస్టెల్లో విద్యాశాఖలో పరిపాలన కొనసాగిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే కారణాలతో ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. తిరిగి జూలై 17వ తేదీన నగరంలోని ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టింగ్ కల్పించారు. విధుల్లో చేరిన సదరు ఉపాధ్యాయురాలు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చి తన ఉద్యోగానికి రిజైన్ (రాజీనామా) చేస్తున్నట్లు డీఈవో కార్యాలయ ఏడీ, డీఈవోని కలిసి తన రిజైన్ లెటర్‌ను అందజేశారు. సస్పెండ్ చేసిన సమయంలో అధికారిని కలవడానికి వెళ్లినప్పుడు తన పట్ల ఇబ్బందిపడేలా వ్యవహరించారని, విద్యార్థులకు న్యాయం చేసేలా బోధన చేశానని తన ఆవేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.