ఢిల్లీ : భారత హాకీలో చర్చనీయాంశమైన జెర్సీ వివాదాన్ని పక్కనబెట్టి ఆటగాళ్లు వరల్డ్‌కప్ ట్రోఫీ సాధనే లక్ష్యంగా ముందుకుసాగాలని దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేష్ జట్టుకు సూచించాడు. జెర్సీ రంగు మార్పుపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శ్రీజేశ్ మాట్లాడుతూ.. ‘మైదానం వెలుపల జరిగేదానిపై జట్టు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న చర్చపై జట్టులోని ఆటగాళ్లకు అవగాహన ఉంటుంది.
దీనిని పక్కనబెట్టి పూర్తిగా ఆటపైనే దృష్టి సారించాలి. ప్రపంచకప్ ట్రోఫీ కోసం మనం 50 ఏండ్లుగా వేచి చూస్తున్నాం. ఈసారి ట్రోఫీని దక్కించుకోవడానికి మనకు సువర్ణావకాశం ఉంది. మన పూల్‌లో ఇంగ్లండ్ ఒక్కటే కఠినమైన జట్టు. గ్రూప్ దశలో అగ్రస్థానాన నిలిస్తే సెమీస్‌లో అర్జెంటీనా ఎదురవుతుంది. మీరు అత్యుత్తమ ఆటను ఆడి ఐదు దశాబ్దాల నిరీక్షణకు తెరదించండి’ అని సూచించాడు.