బెల్లంపల్లి, ఆగస్టు 2 : రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం పూర్తయినప్పటికీ మంచిర్యాల జిల్లాలో మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వల్ల అది కార్యరూపందాల్చడం లేదని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చైర్మన్లను ప్రకటించినప్పటికీ, మంచిర్యాలను మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆశావాహుల్లో నిరుత్సాహం కనిపిస్తున్నది. మరో రెండేళ్లలో ప్రభుత్వ కాల పరిమితి ముగుస్తుందని.. ఇకనైనా అధిష్ఠానం చొరవ తీసుకొని నియామకం చేపట్టాలని పార్టీ వర్గం కోరుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో మహర్దశ
అప్పటి ఆంధ్రా పాలకుల హయాంలో గ్రంథాలయాలు నిరాదారణకు గురయ్యాయి. పక్కా భవనాలు లేకపోవడం, సరైన స్టడీ సౌకర్యం లేకపోవడం, పాఠకులు చదువుకోవడానికి అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రంతాలయాల రూపురేఖలు మారిపోయాయి. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ ప్రధాన గ్రంథాలయాల్లో అధునాతన భవనాలతో పాటు, సరైన ఫర్నిచర్, ఇతర స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. జిల్లాలు.. మండల కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాలకు కూడా వసతులు సమకూరాయి. నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చి పాఠకులకు ప్రయోజనం చేకూరింది.
సీఐ కార్యాలయం ఆవరణలో
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం మొదట సీఐ కార్యాలయం ఆవరణలోని రెండు గదుల్లో కొనసాగేది. సీఐ కార్యాలయంలో ఉండడంతో పాఠకులు సరిగా వచ్చేవారు కాదు. దినపత్రికలు చదవడానికి అనేక మంది వచ్చేవారు. బెల్లంపల్లికి చెందిన చాలా బస్తీలకు ఇది దూరంగా ఉండడంతో ఇక్కడి రావడానికి విముఖత చూపేవారు. ఈ క్రమంలో ప్రజల కోరిక మేరకు 2016లో గ్రంథాలయాన్ని బజార్ ఏరియాలోని పాత క్లబ్ పాఠశాలలోనికి మార్చారు. ఆ గదులు శిథిలావస్తకు చేరడం, పాఠకులు కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. పై పెచ్చులు కూలి పాఠకులకు గాయాలైన సందర్భాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు అవసరమైన స్టడీ మెటీరియల్ ఉండేది కాదు. భయంభయంగానే పాఠకులు ఇక్కడ చదువుకునేవారు. అప్పటి బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్ దృష్టికి పాఠకులు సమస్యను తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన కొంత మేర స్టడీ మెటీరియల్‌ను కూడా అందజేశారు.
అప్పటి చైర్మన్ ప్రవీణ్ కృషితో అధునాతన భవనాలు
మంచిర్యాల జిల్లా అప్పటి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేణికుంట్ల ప్రవీణ్ ముం దుగా గ్రంథాలయాలకు పక్కా భవనాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్‌లోని గ్రంథాలయ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మిగతా గ్రంథాలయాలతో పాటు బెల్లంపల్లి గ్రంథాలయం భవన నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములను ఏర్పాటు చేశారు. దినపత్రికలు చదివే వారి కోసం మరో హాల్‌ను నిర్మించారు. రెండు హాళ్లలో ఏసీ సౌకర్యం, పాఠకులకు సౌకర్యంగా ఉండే కుర్చీలు ఏర్పాటు చేశారు. భవనం ఆవరణలో విశాలమైన స్థలం ఉండడంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఆరు బయట చదువుకునే అవకాశం ఉంది.
అంతర్గత విభేదాలతోనే ముందుకు పడని అడుగు
మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కలిసి రాకపోవడంతోనే నియామకానికి అడుగు ముందు పడడం లేదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ఎంపీ మూడు పదవులు వచ్చాయి. మరో నియోజకవర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా పదవులు చేపట్టారు. దీంతో కేవలం మంచిర్యాల నియోజకవర్గం నుంచి మాత్రమే గ్రంథాలయ చైర్మన్‌ను నియామకం చేపట్టాలనే డిమాండ్ నాయకుల్లో నెలకొంది. చెన్నూర్ నియోజకవర్గంలో ఓ విద్యాసంస్థల చైర్మన్‌కు పదవి కట్టబెట్టాలని చూసిన మరో నియోజకవర్గ ప్రజాప్రతినిధి అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి తాము అంటే తాము అన్నట్లు కోల్డ్ వార్ నడుస్తున్నది. దీంతో చైర్మన్ నియామకం గత రెండున్నరేళ్లుగా మరుగున పడింది. ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కుతాయని మహేశ్వర్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రకటించడంతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వార్తో చైర్మన్ ఎన్నిక కావడం లేదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.