సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం మార్చి 3న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకున్నది. ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇదేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చిలోనే అధిగమించడం విశేషం.
ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండడంతో డిమాండ్ భారీగా నమోదవుతున్నది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని పాటిల్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో 33కేవీ/11కేవీ ఫీడర్లపై, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని సీఎండీ ఆదేశించారు.