సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు రెండురోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. బిల్లులు తీయడం ఆలస్యమైతే.. విద్యుత్ వినియోగంలో స్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో పీస్‌రేట్ వర్కర్లుగా పనిచేస్తున్న కరెంట్ మీటర్ రీడర్లకు నెలలో కేవలం ఆరురోజులు మాత్రమే పని ఉంటుంది.
ఒక మీటర్ రీడింగ్ తీస్తే వారికిచ్చేది కేవలం రూ. 2.51 పైసలు. ఆందులోనూ 50 నుంచి 60 పైసలు మినహాయించుకుని మిగతా సొమ్మును మీటర్ రీడర్లకు చెల్లిస్తున్నారు. ఇలా మీటర్ రీడర్లకు ప్రతీనెలా కేవలం పదివేల లోపే డబ్బులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తమను ఆర్టిజన్లకింద చూస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు తమకు గుర్తింపే కల్పించడం లేదని పీఎంఆర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏండ్లుగా తాము ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లింగ్ పనులు నిర్వహిస్తున్నామని, అయితే బిల్లింగ్ గడువును 22 రోజుల నుంచి ప్రతీనెలా ఆరో తేదీ వరకే పూర్తిచేయాలని అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని, దీంతో తాము పనిచేయలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.
గృహజ్యోతిపై ప్రభావం
ఇదిలా ఉంటే ఆరురోజుల తర్వాత పనులు లేవని చెబుతూనే అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని, ఆ తర్వాత కేవలం ఆరువేల నుంచి పదివేల వరకే జీతం ఇవ్వడంతో తాము ఆర్ఘిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యుత్ మీటర్ రీడర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం కొండాపూర్ డివిజన్ కార్యాలయం ఎదుట మీటర్ రీడర్లు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు బిల్లింగ్ విధులకు హాజరుకాబోమని వారు స్పష్టం చేశారు. కాగా, పీఎంఆర్ల సమ్మెతో మీటర్ బిల్లింగ్ ఆగిపోయి గృహజ్యోతి పథకంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. 200 యూనిట్ల లోపు బిల్లింగ్ వారికే ఉచిత విద్యుత్ కాగా.. ఈ సమ్మెతో మీటర్ రీడింగ్ నిర్ణీత యూనిట్లు దాటిపోయి లబ్ధిదారులకు బిల్లు వచ్చే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. కొండాపూర్ డివిజన్లో జరిగిన సమ్మెలో సతీష్లింగం, నరేశ్‌యాదవ్, పరుశురామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.