ముంబై, సెప్టెంబర్ 26 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చడంతో సూచీలు కుదేలయ్యాయి. బ్రాండెడ్ ఔషధ ఎగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడంతో దేశీయ మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ 733.22 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్ఠ స్థాయి 80,426.46 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ సైతం 236.15 పాయింట్లు కోల్పోయి 24,654.70 వద్ద నిలిచింది. ట్రంప్ దెబ్బకు ఫార్మా, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్ ఏకంగా 2.14 శాతం నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది.
రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో కొనసాగుతుండటంతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన ఆరు సెషన్లలో మదుపరులు రూ.16 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువ రూ.450.85 లక్షల కోట్లకు దిగొచ్చింది. అంతకుముందు వారంలో రూ.466.89 లక్షల కోట్లుగా ఉన్నది.