Digital transactions | కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించిన (GST cuts) విషయం తెలిసిందే. కొత్త రేట్లు ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వినియోగదారుల్లో ఉత్సాహం రెట్టింపైంది. పలు వస్తువుల రేట్లు తగ్గడంతో పాటుగా నవరాత్రుల (Navratri) సందర్భంగా పలు సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించడంతో తొలి రోజు దేశంలో కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా మూడున్నర దశాబ్దాల్లోనే లేనంతగా డిజిటల్ చెల్లింపులు (Digital transactions) ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెరిగాయి.
జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజైన సెప్టెంబర్ 22న ఏకంగా రూ.11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లావాదేవీల్లో అధికభాగం ఆర్టీజీఎస్ ద్వారా జరిగినవే కావడం గమనార్హం. ఆర్టీజీఎస్ ద్వారా రూ. 8.2 లక్షల కోట్లు, నెఫ్ట్ ద్వారా రూ. 1.6 లక్షల కోట్లు, యూపీఐ ద్వారా రూ. 82,477 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. అంతేకాదు డెబిట్, క్రెడిడ్ కార్డు చెల్లింపులు కూడా పెరిగాయి. క్రెడిట్ కార్డు చెల్లింపులు 6 రెట్లు పెరిగి రూ.10,411 కోట్లకు, డెబిట్ కార్డు చెల్లింపులు 4 రెట్లు అధికమై రూ.814 కోట్లకు చేరాయి.
అంతకుముందు రోజు, అంటే సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం రూ.1.1 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. అదే జీఎస్టీ రేట్లు తగ్గింపు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే డిజిటల్ లావాదేవీలు ఏకంగా 10 రెట్లు పెరగడం విశేషం. జీఎస్టీ రేట్లు తగ్గింపు తొలిరోజు కార్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు మారుతీ, టాటా, హ్యుందాయ్ సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 23న కూడా రూ.11.19 లక్షల కోట్ల విలువైన డిజిటల్ చెల్లింపులు నమోదయ్యాయి.
Also Read..
ఆవిరవుతున్న ఎంఎస్ఎంఈల ఆశలు.. అరచేతిలో వైకుంఠంచూపి అమలు చేయకుండా నిలిపివేసిన కాంగ్రెస్ సర్కారు
25 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ