ముంబై, సెప్టెంబర్ 25 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. అమెరికా హెచ్1-బీ వీసా ఫీజు పెంచడంతో నెలకొన్న ఆందోళనతో విదేశీ మదుపరులు భారీగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సూచీల నష్టానికి ప్రధాన కారణం. ఇదే క్రమంలో గురువారం ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 555.95 పాయింట్లు కోల్పోయి 81,159.68 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ కీలక మైలురాయిని కోల్పోయింది. తన 25 వేల మార్క్ దిగువక పడిపోయింది. చివరకు 166.05 పాయింట్లు నష్టపోయి 24,890.85 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ నిరాశపరిచిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నిఫ్టీ తొలిసారిగా 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయిందని, రూపాయి బలహీనపడుతుండటం మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.