హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ కూడా కాంగ్రెస్ ఎన్నికల హామీలాగే మారిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా భారీగా రాయితీలు ప్రకటించిన సర్కారు.. వాటిని అమలు చేయలేక కిందామీదా పడుతున్నది. పాలసీ ప్రకటించి ఏడాది దాటినా ఇంతవరకు దాని మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. సబ్సిడీలు పెంచడంతోపాటు కొన్ని కొత్త పథకాలను పాలసీలో చేర్చడంతో చాలామంది ఔత్సాహికులు కొత్త పాలసీ అమలయ్యాక యూనిట్లు స్థాపించాలని యోచిస్తుండగా, ప్రభుత్వ జాప్యంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టి ఈనెల 18వ తేదీతో సంవత్సరం పూర్తయింది. అయినా ఇంతవరకు దానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయలేదు.
కొత్త పాలసీలో ప్రధానంగా టీ-ఐడియా పథకం కింద తయారీ సంస్థలకు ఇస్తున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీని 15 శాతం నుంచి 25 శాతానికి, గరిష్ఠ రాయితీ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచడంతోపాటు టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న రాయితీలు 35 శాతం నుంచి 50 శాతానికి, గరిష్ఠ రాయితీ పరిమితిని రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచారు. అలాగే, మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న 10 శాతం అదనపు రాయితీని 20 శాతానికి పెంచుతూ గరిష్ఠ రాయితీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు సవరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేసి అందులో 20 శాతం ఎంఎస్ఎంఈలకు కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బ్యాంకు నుంచి తీసుకునే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటర్‌గా ఉంటుందని కొత్త ఎంఎస్ఎంఈ పాలసీలో హామీ ఇచ్చారు.
పాలసీ ప్రవేశపెట్టి ఏడాది దాటినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీనికి కారణం కొత్త పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయకపోవడమే. అధికారులు పాలసీతోపాటే మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపగా, ప్రస్తుతం యువ వికాసం పథకం అమల్లో ఉన్నందున కొంతకాలం ఆగాలంటూ సచివాలయంలోని ఉన్నతాధికారులు ఆ ఫైలును తిప్పి పంపినట్లు సమాచారం. కొత్త పాలసీలో సబ్సిడీలు ఎక్కువగా ఉండటంతో మార్గదర్శకాలు వచ్చాక యూనిట్లు స్థాపించాలని చాలామంది వేచిచూస్తున్నారు. ఇలాంటి ఔత్సాహికుల ఒత్తిడి మేరకు మరోసారి పరిశ్రమల శాఖ అధికారులు మార్గదర్శకాల ఫైలును సచివాలయానికి పంపగా, ఇంతవరకు దానిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు సంవత్సరకాలంగా ఆ ఫైలు సచివాలయంలోనే పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా కొత్తగా యూనిట్లు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ అంశంపై అధికారులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ సైతం కాంగ్రెస్ ఎన్నికల హామీల జాబితాలోకి చేరిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో సహా 420 హామీలను గాలికొదిలేసినట్లుగానే ఎంఎస్ఎంఈ పాలసీని సైతం అటకెక్కించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ మార్చాలనే ఉద్దేశంతోనే హడావుడిగా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తెరపైకి తీసుకొచ్చారని, సబ్సిడీలతో పడే అదనపు భారం భరించే స్థితిలో ప్రభుత్వం లేనందునే మార్గదర్శకాల్లో జాప్యం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.