Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది.
ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల (Social Media) నిషేధంపై నేపాల్ ప్రభుత్వం (Nepal Govt) వెనక్కి తగ్గింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్‌తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధింస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు చల్లారట్లేదు. మరోవైపు రాజధాని సహా పలు ప్రధాన నగరాల్లో సైన్యం మోహరించింది.
రాజకీయ సంక్షోభం..?
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి (KP Oli) రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. హోంమంత్రి రమేష్ లేఖక్ అధికారికంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ సమావేశంలో లేఖక్ తన రాజీనామాను ప్రధాని ఓలికి సమర్పించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్ పౌడేల్ కూడా తమ పదవులకు రిజైన్ చేశారు. దీంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి తలెత్తింది.
దుబాయ్‌కి ప్రధాని ఓలి..
తాజా పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలి దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన దుబాయ్ (Dubai)కి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. హిమాలయ ఎయిర్‌లైన్స్ అనే ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్‌లో ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన ఇప్పటికే ఉప ప్రధాన మంత్రికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఓలి వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్ వెళ్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read..
Nepal | రణరంగంగా నేపాల్.. భారతీయులకు కీలక అడ్వైజరీ
Social Media Ban | వెనక్కి తగ్గిన నేపాల్ సర్కార్.. సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత
నేపాల్ రణరంగం.. సోషల్ మీడియా నిషేధంపై భగ్గుమన్న ‘జనరేషన్ జెడ్’