కాఠ్మాండు, సెప్టెంబర్ 6 : నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాంది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారుడు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పులలో 20 మంది నిరసనకారులు మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు. నిరసనలు కాఠ్మాండుతోపాటు ఇతర నగరాలకు కూడా విస్తరించడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు.
కమ్యూనికేషన్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వశాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోని కారణంగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్‌తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని సెప్టెంబర్ 4న ఓలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని రగిల్చింది. రెగ్యులేటరీ నిబంధనల మేరకు తాము యాప్‌ల నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కేందుకు చేపట్టిన సెన్సార్షిప్ చర్యగా యువజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను అడ్డుకుని, సోషల్ మీడియా యాప్‌లను నిషేధించినప్పటికీ జనరేషన్ జెడ్ ఉద్యమకారులు టిక్‌టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేలాదిమంది యువజనులను సమీకరించారు.
మైటీఘర్ మండాలా వద్ద మొదలైన ర్యాలీ పార్లమెంట్ భవనం వైపు దూసుకువెళ్లింది. నిరసనకారులు పార్లమెంట్ భవనానికి చేరువ అవుతుండగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహోదగ్రులైన నిరసనకారులు బ్యారికేడ్లను ఛేదించుకుంటూ ముందుకు దూకారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, జలఫిరంగులను ప్రయోగించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కొందరు నిరసనకారులు పార్లమెంట్ భవనం ప్రహరీని చేరుకోగలిగారు. బాష్పవాయు గోళాలను కాలుస్తున్న పోలీసులపైకి ఆందోళనకారులు నీళ్ల సీసాలు, రాళ్లను విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. పార్లమెంట్ గేట్లలో ఒకదాన్ని విరగ్గొట్టిన ఆందోళనకారులు దానికి నిప్పుపెట్టారు. స్కూలు, కాలేజీ యూనిఫామ్‌లు ధరించిన విద్యార్థులు వాక్ స్వాతంత్య్రం మా హక్కు, ప్రజలు కట్టిన పన్ను డబ్బు ఎక్కడ పోయింది వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను చేత పట్టుకున్నారు. ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలలో పెల్లుబికిన నిరసనే జనరేషన్ జెడ్ విప్లవమని విశ్లేషకులు వాదించారు. సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించడంతో ప్రజాగ్రహం అగ్నిపర్వతంలా బద్దలైందని వారు చెప్పారు.
ప్రధాని కేపీ శర్మ ఓలి మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దేశం పట్ల తృణీకార భావాన్ని తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు) మహాసభలో ఆయన ప్రసంగిస్తూ రిజిస్టర్ చేసుకోవలసిందిగా సోషల్ మీడియా కంపెనీలకు మంత్రిత్వశాఖ ఆగస్టు 28 నుంచి ఏడురోజుల గడువు ఇచ్చిందని ఆయన చెప్పారు. బుధవారం రాత్రితో గడువు ముగిసిపోయిందని, అయితే తర్వాత మెటా(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సా ప్), ఆల్ఫాబెట్(యూట్యూబ్), ఎక్స్(ఒకప్పటి ట్విటర్), రెడిట్, లింక్డ్ఇన్ దరఖాస్తులు సమర్పించాయని ఆయన తెలిపారు.