Dinner Tips | సాయంత్రం సమయంలో త్వరగా భోజనం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెప్పడంతో చాలా మంది సాయంత్రం ఆహారాన్ని 6 నుండి 8 గంటల మధ్యలో తీసుకుంటున్నారు. నిద్రించే సమయానికి 2 నుండి 3 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. అయితే సాయంత్రం సమయంలో త్వరగా భోజనం చేయడం వల్ల నిద్రించే ముందు ఆకలి అవ్వడం సహజం. దీంతో చాలా మంది చిన్న చిన్న స్నాక్స్ ను తింటూ ఉంటారు. దీని వల్ల శరీరంలోకి క్యాలరీలు ఎక్కువగా వచ్చి చేరతాయి.
త్వరగా భోజనం చేయడం మంచిదే అయినప్పటికీ రాత్రి ఆలస్యంగా స్నాక్స్ తినకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. స్నాక్స్ తినకుండా ఉండడం వల్ల మాత్రమే త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నిద్రించే ముందు స్నాక్స్ తినడాన్ని తగ్గించుకోవచ్చు. లేట్ నైట్ స్నాకింగ్ ను నిరోధించే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి త్వరగా చేసే భోజనం సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రొట్టె, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్, కొద్దిగా నెయ్యి, నట్స్, సీడ్స్, అవకాడో వంటి ఆహారాలను తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో కేవలం కార్బోహైడ్రేట్స్ ను మాత్రమే తీసుకోవడం వల్ల రాత్రి 9 నుండి 11 గంటల మధ్య ఆకలి పెరిగి చిప్స్, తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. కనుక సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రాత్రి స్నాక్స్ తినాలనే కోరిక సహజంగానే తగ్గుతుంది.
త్వరగా భోజనం చేసిన తరువాత స్నాక్స్ తినాలనే కోరిక కలగడం సహజం. దీనిని పూర్తిగా నివారించకుండా 2 గంటల తరువవాత చిన్న స్నాక్ ను తీసుకోవచ్చు. అయితే ఇది ఆరోగ్యకరమైనది అయి ఉండాలి. పండ్లు, చియా సీడ్స్, వేడి పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే కొన్నిసార్లు రాత్రి వేసే ఆకలి నిజానికి దాహం కావచ్చు. ఒక గ్లాస్ నీటిని తాగి 10 నుండి 15 నిమిషాలు వేచి ఉండాలి. ఆకలి తీరినట్టుగా ఉంటే అది దాహం అని అర్థం. అలాగే శరీరానికి సరిపడా నీటిని తాగాలి. నిద్రించే ముందు కాఫీ లేదా చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను తాగకూడదు. అలాగే రాత్రి 9 తరువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకోవాలి. ఈ అలవాటు ప్రారంభంలో కష్టంగా ఉన్నా ఒకటి నుండి రెండు వారాలు గడిచే కొద్ది అలవాటుగా మారిపోతుంది. అదే విధంగా రాత్రి స్నాక్స్ తినాలనే కోరిక కలిగినప్పుడు దృష్టిని మరల్చడానికి పుస్తకాలు చదవడం, తేలికగా వ్యాయామం చేయడం, గోరు వెచ్చని స్నానం చేయడం వంటివి చేయాలి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు తినాలనే కోరిక తగ్గేలా చేస్తాయి.
ఇక ఒత్తిడి, ఆందోళన, అలసట వంటివి కూడా నచ్చిన ఆహారం తినాలనే కోరిక కలిగేలా చేస్తాయి. కనుక ఒత్తిడి వంటివి తగ్గడానికి లోతుగా శ్వాస తీసుకోవడం, కొద్ది దూరం నడవడం, నచ్చిన వారితో మాట్లాడడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండడం లేదా చిన్న మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రాత్రి ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. కనుక రోజులో మూడు ప్రధాన భోజనాలు 1 లేదా 2 సార్లు స్నాక్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఎక్కువగా తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి రాత్రి సమయంలో స్నాక్స్ తీసుకోవడాన్ని తగ్గించుకోవచ్చుని నిపుణులు తెలియజేస్తున్నారు.