ఎర్రుపాలెం: సెప్టెంబర్ 09 : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో(Road accident) దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ సమీపంలో లారీ ఢీకొని బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూర్ గ్రామానికి చెందిన దామినేని శ్రీనివాసరావు (54), దామినేని రజిని కుమారి(50)గా గుర్తించారు. వీరు తక్కెళ్లపాడు నుండి బైక్ మీద ములుగుమాడు వైపు వెళ్లే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.