రంగారెడ్డి, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ కార్యాలయాల్లో కీలక భూమిక పోషిస్తున్న టైపిస్టు కామ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 15 ఏండ్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నది. జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 42 మంది కంప్యూటర్ ఆపరేటర్లు సర్కార్ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాల్లో టైపిస్టు, ఆపరేటర్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. 2012లో 7,500 వేతనం ఇవ్వగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ వీరి సేవలను గుర్తించి వేతనాలను రూ.15 వేలకు పెంచింది. 2023లో మరోసారి రూ.22,500కు పెంచింది.
గతేడాది గ్రూప్-3, గ్రూప్-4 ద్వారా కొన్ని పోస్టులను ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయాల్లో భర్తీ చేసింది. వీఆర్వోలు, వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపించగా.. వారిలో కొందరిని తిరిగి రెవెన్యూశాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఇక టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు అవసరం లేదని, వారి సేవలు మార్చి 31తో ముగుస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ శాఖలోనే కాకుండా రాష్ట్రంలోని పలు శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసిం ది. జిల్లాలోని కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 42 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత 15 నుంచి 20 ఏండ్లుగా రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లు, టైపిస్టులుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపుతో పలు సేవలకు బ్రేక్ పడనున్నది. తహసీల్దార్ కార్యాలయాల్లో వివిధ స్థాయిలో ఇచ్చే సర్టిఫికెట్లు, ల్యాండ్ రికార్డులు, భూ రికార్డుల ప్రక్షాళన, జనగణనతోపాటు మీసేవా కార్యక్రమాలు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి తదితర దరఖాస్తులను వారు ఆపరేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వారిని తొలగిస్తే సేవలు ఆగిపోతాయని పలువురు రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు.