Donald Trump : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై పూర్తి నియంత్రణ తమకే ఉందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ట్రూత్ సోషల్ (Truth Social)’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్‌పై రాసి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను దిగ్బంధనం చేసిన అమెరికా.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్నది.
మరోవైపు.. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్‌పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మంగళవారం స్పష్టంచేశారు. ‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’ అని స్పష్టంచేశారు.
కాగా ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు, సంప్రదింపులేవీ జరగడం లేదని ట్రంప్ స్పష్టంచేశారు. ఇరాన్ నౌకల విషయంలో దిగ్బంధనం పూర్తిస్థాయిలో కొనసాగుతోందని తెలిపారు. హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని చెప్పారు. సముద్ర జలాల్లో ఇరాన్ అమర్చిన పేలుడు పదార్థాలను తొలగించామని, కొన్నింటిని పేల్చివేశామని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ప్రకటించారు.