వినాయక చవితి వెళ్లిపోయింది.. రేపో మాపో దసరా సందడి మొదలుకానుంది. ఇప్పట్నుంచే షాపింగ్ మాల్స్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు రకరకాల ఆఫర్లతో మోతెక్కించేస్తున్నాయి. 5 శాతం నుంచి 95 శాతం డిస్కౌంటు వరకు నానారకాల వస్తువులూ మీకు అందుబాటులో ఉంటాయని ఊరించేస్తున్నాయి. వినడానికి చాలా బాగుంది కదూ! ఏదన్నా వస్తువు కొనాలంటే చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి కదూ! కానీ మనమంతా ఇక్కడే తప్పు చేస్తుంటాం. అదేంటో మీరే చూడండి!
శరీరంలో ఇతర భాగాల్లాగా మన మెదడు కూడా ఒక అవయవమే! దానికి కూడా అలసట ఉంటుంది. ఎంత మంచి పుస్తకం అయినా, నిరంతరం చదువుతూ ఉంటే అలసిపోతాం; ఎంత గొప్ప సంగీతం అయినా, సదా వింటూ ఉంటే అలసిపోతాం… అలాగే నిరంతరం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా అలసిపోతామని నిపుణుల మాట. దీనికి నిర్ణయాల అలసట (Decision Fatigue) అని పేరు పెట్టారు.
డెసిషన్ ఫెటీగ్కి మన రోజువారీ జీవితంలో చాలా ఉదాహరణలే దొరుకుతాయి. ఉదాహరణకి ఓ సూపర్ మార్కెట్‌కే వెళ్లామనుకోండి. అక్కడ కంటి ముందు చాలా వస్తువులు ఊరిస్తూ కనిపిస్తాయి. ఇంతకుముందు మనం చూడనివో, చౌకగా దొరికేవో, వైవిధ్యంగా ఉండేవో… తమని కొనమంటూ ఆహ్వానిస్తుంటాయి. మనమేమో ఆ వస్తువుని కొనాలా వద్దా అన్న ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతుంటాం. ఇలా ప్రతీ అర దగ్గరా మన మనసులో ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంటుంది. చివరికి ఆ సూపర్ మార్కెట్లోంచి బయటకు వచ్చేసరికి మన చేతుల్లో పనికిమాలిన వస్తువులు చాలానే చేరుతాయి. మార్కెట్లో అడుగుపెట్టిన కాసేపటికి నిర్ణయాలు తీసుకునే విచక్షణ ‘అలసిపోవడమే’ ఇందుకు కారణం.
ఈ అలసట కేవలం వస్తువుల కొనుగోళ్లలో మాత్రమే కాదు… జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎదురుపడుతుంది. ఉదాహరణకు న్యాయస్థానాలనే తీసుకోండి. పాపం అక్కడి న్యాయమూర్తులు పొద్దున లేచిన దగ్గర్నుంచీ బుర్ర వేడెక్కించేసే అనేక కేసులను వినాల్సి వస్తుంది. దాంతో ఒక్కో కేసు గడిచేకొద్దీ వారు ప్రతికూల నిర్ణయాలను తీసుకుంటారని తేలింది. ఒక అంచనా ప్రకారం మొట్టమొదటి కేసులో చాలా సానుకూలమైన తీర్పునిచ్చే న్యాయమూర్తులు రానురానూ ఒక్కో మెట్టూ కిందకి దిగుతూ… ఒకానొక సందర్భంలో 65 శాతం ప్రతికూలమైన తీర్పునే ఇచ్చేందుకు సిద్ధపడిపోతారట.
కేవలం వినియోగదారులు, న్యాయమూర్తులే కాదు… గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల పట్ల విచిత్రంగా ప్రవర్తించడం, సినిమా తారలు తమ వ్యక్తిగత జీవితాలను ధ్వంసం చేసుకోవడం లాంటి సందర్భాలలో ఈ డెసిషన్ ఫెటీగ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ఇంతకీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలాగ అనేదానికి కూడా నిపుణులు కొన్ని సూచనలు అందచేస్తున్నారు. అవేమిటంటే…

Online Shopping Websites