వాళ్లకు ఇల్లే వైకుంఠం అనేవారు పెద్దలు. గృహమే కదా స్వర్గసీమ అనే నానుడీ విని ఉంటాం. బయటికి అడుగు పెడితే ట్రాఫిక్, హడావుడి… ఇలాంటి సమయంలో కొద్ది రోజులు కాస్త ఖాళీ దొరికినా ఇంట్లోనే ఉండాలన్న ఆలోచన పెరుగుతున్నది. అలాంటప్పుడు ఏమేం చేయొచ్చో తెలుసుకుంటే… ఆ రోజును మరింత సరదాగా గడపొచ్చు.
ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే బయటికి వెళ్లాలనుకునేవారు. షాపింగ్, సినిమాలు, రెస్టారెంట్లు, పార్టీలంటూ వారాంతాన్ని కూడా ఒక కార్యక్రమంలా మార్చేసుకునేవాళ్లు చాలామంది. ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇంట్లోనే ఉండాలని కోరుకునే రోజులు పెరుగుతున్నాయి. ఎకడికీ వెళ్లకుండా, బయటివాళ్లను ఎదుర్కోకుండా, మనకు నచ్చినట్టుగా ఒక రోజు గడపడం కూడా ఓ ఆనందమేనని చాలామంది గుర్తిస్తున్నారు. బయట ప్రపంచం ఎంత పెద్దదైనా మనసుకు నచ్చిన చిన్న ప్రపంచం ఇంట్లోనే దొరికితే ఆ హాయే వేరు అన్న భావన ఇది. అలాగని అదేం సమయాన్ని వృథా చేయడం కాదు.
ఇంట్లో ఉండటం అంటే ఖాళీగా ఉండటం అని అర్థమేం కాదు. కొన్ని అనుభూతుల్ని పోగేసుకోవడం. మనసును శాంత పరచుకోవడం. ఉదయం నిదానంగా కాఫీ తాగుతూ బాలనీలో కూర్చోవడం, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, ఎన్నాళ్లుగానో చదవాలనుకున్న పుస్తకాన్ని తీసుకుని చదవడం, ఇష్టమైన పాటలు వింటూ ఇంటిని సర్దుకోవడం, వంటగదిలో కొత్త వంటకం ప్రయత్నించడం, మొకలకు నీళ్లు పోస్తూ కాసేపు వాటితో గడపడం… ఇవన్నీ చిన్న పనుల్లానే కనిపిస్తాయి. కానీ, ఎప్పుడూ పరుగులో ఉండే జీవితానికి ఇవే అసలైన విరామాలు. ఇంట్లో గడిపే సమయం ఇప్పుడు ఏమీ చేయని సమయం కాదు. మనకు నచ్చిన పనిని, మన వేగంతో చేసుకునే సమయం.
ఈ రోజుల్లో ఇల్లు కూడా మన వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రదేశంగా మారుతున్నది. ఖరీదైన వస్తువులతో నింపడం కంటే, మన జ్ఞాపకాలకు దగ్గరైన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణంలో తెచ్చుకున్న చిన్న జ్ఞాపిక, తాతయ్యల కాలం నాటి గడియారం, అమ్మ ఇచ్చిన పాత దీపం, మన చేతితో వేసిన చిత్రం ఇలా ఒకో వస్తువుకీ ఒక కథ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇల్లు ఇప్పుడు చూడటానికి అందంగా ఉండాలి అన్నదానికంటే.. ఉండటానికి హాయిగా ఉండాలి అనే ఆలోచనకు దగ్గరగా ఉంటున్నది.
‘ఇవన్నీ మనకెందుకు? ఓ మూలన కూర్చుంటే సరి’… అనిపించే సందర్భాలు ఇప్పటి జీవితాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఇంటి ప్రతి మూలనూ అందంగా మలచుకుంటే సరి. ఇంట్లో ఒక మూలను పూర్తిగా మనకోసం కేటాయించుకోవడం కూడా ఈ మార్పులో భాగమే. అది పెద్ద గది కానకర్లేదు. కిటికీ పకన ఓ కుర్చీ, పకనే చిన్న బల్ల, దానిపై పుస్తకాలు, ఇష్టమైన మొక అంతే. రోజులో కాసేపు అకడ కూర్చోవడం మనసుకు ఓ చిన్న సెలవులా అనిపిస్తుంది. ఒకరికి అది పుస్తకాల మూల కావచ్చు. మరొకరికి సంగీతం వినే చోటు. ఇంకొకరికి మొకల మధ్య ప్రశాంతంగా కూర్చునే ప్రదేశం. ఇంటి పరిమాణం కాదు అందులో మనకు దొరికే స్థలమే ముఖ్యం.
ఇంట్లో ఉండటంలో మరో అందం, కుటుంబంతో కలిసి చేసే చిన్న పనుల్లో ఉంటుంది. అందరూ కలిసి వంట చేయడం, పాత ఆల్బమ్ తీసి జ్ఞాపకాలు గుర్తుచేసుకోవడం, ఆటలు ఆడటం, సాయంత్రం బాలనీలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఇవి ఖరీదైన వినోదాలు కావు. కానీ, గుర్తుండిపోయే అనుభవాలవుతాయి. అందులో అందరూ కొంతసేపు ఫోన్లను పకన పెట్టడం ముఖ్యం. ఒకే ఇంట్లో ఉంటూ ఒకొకరు ఒకో తెరలో మునిగిపోయే రోజుల్లో, ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం కూడా ఒక విలాసమే.
ఇల్లంటే నాలుగు గోడలే కావచ్చు. కానీ, అందులో మనసుకు చోటు దక్కినప్పుడు అదే మనకు అత్యంత ఇష్టమైన ప్రపంచం అవుతుంది. ఇంట్లోనే ఉండటాన్ని ఒంటరితనంగా చూడాల్సిన అవసరం లేదు. కొంతసేపు ప్రపంచం నుంచి విరామం తీసుకుని మనతో మనం గడపడం ఒక చక్కటి కొత్త జీవన విధానం. ప్రతి ఖాళీ నిమిషాన్నీ ఏదో ఒక పనితో నింపాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం కూడా జీవితంలో ఒక ఎదుగుదలే. ప్రపంచాన్ని చూడాలని, ప్రయాణాలు చేయాలని కోరిక ఉండొచ్చు. కానీ, ప్రతిసారీ ఆనందం కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు కావాల్సిన ప్రశాంతత ఒక కప్పు టీ దూరంలోనే ఉంటుంది. కిటికీలోంచి కనిపించే ఆకాశంలో కనిపిస్తుంది… అన్నదే ఈ ట్రెండ్!