‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ‘జగడం’ సినిమా చూశా. అప్పుడే దర్శకుడు కావాలని ఫిక్సై పోయాను. ఇంటర్మీడియెట్ తర్వాత హైదరాబాద్ వచ్చి నాలుగేళ్లు ప్రయత్నించి సుకుమార్‌గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాను. అలా నా సినీ ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమా ‘దసరా’తో సంచలనం సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ గోదావరిఖని యువకుడు తన ద్వితీయ ప్రయత్నంగా నానితో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
నిజ జీవితంలో నేను చూసిన సంఘటనలకు కాల్పనిక అంశాల్ని జోడించి ‘ది ప్యారడైజ్’ కథ సిద్ధం చేశా. ఇందులో ఉండే తిరుగుబాటుతత్వం, ధిక్కారాన్ని ప్రదర్శించే పాత్రలకు నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతమే స్ఫూర్తినిచ్చింది. నేను కొంతకాలం సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నా. ఆ పక్కన ఉండే బస్తీ జీవితాన్ని చూస్తున్నప్పుడు మా ఉరిలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చేవి. ఈ కారణంగానే సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ రాశాను.