హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై పాలమూరు రైతులు తిరుగబడ్డారు. పంటలెండుతున్నా పట్టించుకోని వైనంపై దండెత్తి జూరాల ప్రాజెక్టునే దిగ్బంధించారు. ప్రాజెక్టు తాళాలు బద్దలుకొట్టి ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ‘పంటలు ఎండిపోతున్నాయి నీటిని విడుదల చేయండి మహాప్రభూ’ అంటూ ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపుమండిన రైతాంగం ఏకమై గేట్లెత్తిన ఘటన కలకలం రేపింది.
జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు లేవని అధికారులు విడుదల చేయడంలేదు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో మొత్తం గేట్లను కుడి, ఎడమ కాలువలతోపాటు ప్రాజెక్టులకు నీటి విడుదలను నిలిపివేశారు. కొన్నిరోజుల నుంచి కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, కాలువలకు నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
సాగునీటిని విడుదల చేయాలని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ అధికారులకు 10 రోజులుగా విన్నవించుకుంటున్నా ఫలితం దక్కడంలేదు. దీంతో శనివారం 300 మంది రైతులు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎడమ కాలువ వద్దకు చేరుకుని తూము గేట్లను పైకెత్తే క్రమంలో తాళాలను బద్దలుకొట్టారు. ఎడమ కాలువ తూములు పైకెత్తడంతో ఒక్కసారిగా నీళ్లు కాలువలోకి దూకడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. గంటవరకు వేచి చూసి నా అధికారులు రాకపోవడంతో తూములను తెరిచి ఉంచి వెళ్లిపోయారు. గంటన్నర తర్వా త అధికారులు వచ్చి తూములను మూసివేయడంతో నీటి సరఫరా నిలిచిపోయింది.

జూరాల ఆయకట్టు కింద ఈసారి రైతాంగం పెద్ద ఎత్తున పంటలు సాగుచేసింది. కృష్ణా నదికి దాదాపు 50 రోజుల వరకు వరద నిరంతరాయంగా రావడంతో ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. నీళ్లొచ్చే సమయంలో కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా స్పిల్ వే గేట్లను తెరిచి శ్రీశైలానికి వదిలి వేసింది. కరెంటు లేదని, ఎత్తిపోయ లేమని, సర్కార్ ఆదేశాలు లేవని, క్యాబినెట్ అప్రూవల్ కావాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటిదాకా దాటవేస్తూ వచ్చారు. ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లి నీటిని దిగువకు వదిలి మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు పంటలు చేతికొచ్చే దశలో నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జూరాల ప్రాజెక్టు కిందనున్న గద్వాల, ఆత్మకూరు రైతాంగం సైతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
జూరాల ఆయకట్టు కింద నీటిని విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఎడమ కాలువ కింద సాగునీటిని విడుదల చేయాలని, పంటలను కాపాడాలని రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినా అధికార యంత్రాంగం కానీ, అధికార పార్టీ నేతలు కానీ పట్టించుకోవడమే లేదు. దీంతో విసిగి వేసారిన రైతులు తిరుగుబాటుకు దిగారు. ఇరిగేషన్ అధికారులు కూడా రైతాంగం ఆవేశాన్ని చూసి జడుసుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏకంగా తూములను బద్దలుకొట్టే పరిస్థితి వస్తుందని రైతాంగం హెచ్చరిస్తున్నది.
దీంతో అధికారులకు ఏం చేయాలో తోచక ప్రభుత్వంపై భారంపెట్టింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేసేది లేక బలవంతంగా తూములు ఓపెన్ చేశారు. గంటల తర్వాత అధికారులు రైతులంతా వెళ్లిపోయాక తూములను మూసివేశారు. ఆదివారం నాడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఇరిగేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్‌పై రైతులు తిరుగబడే పరిస్థితి రావడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ దశలో ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందా? పంటలు ఎండిపోయే పరిస్థితికి తీసుకొస్తుందా? అనేది వేచి చూడాలి.