(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ
సచ్చసామితో కలిసి జంగిటికి వెళ్లడానికి సిద్ధమవుతాడు మేఘచంద్రుడు. జయసేనుని మీదికి ఈసాణుడు గురి చూసి విసిరిన ఈటెను అడ్డుకుంటాడు ఒక వీరుడు. కాషాయ వస్త్రాలు ధరించి శ్రీకూర్మం బయల్దేరిన ప్రణాళుడికి, రోహదేవికి ఒక కొత్త వ్యక్తి ఎదురుపడతాడు. తర్వాత…
మామిడి తోటలోని భూగృహం వద్దకు ముందుగా చేరుకున్న అశ్వికుడు అలక్కుడు అక్కడ ఆగిపోయినాడు.
అతణ్ని అనుసరిస్తున్న పదిమంది వస్తాదులు; బండిమీద బంధించి తీసుకొస్తున్న పోటిసుడు; మరో రథంలో సవరసత్తి; మిగతా అందరూ వచ్చినారు.
అలక్కుడు వస్తాదుల వంక చూసి..
“మీరు లోపలికి దిగి, అంతా సవ్యంగా ఉందేమో చూసి రండి!” అని ఆజ్ఞాపించినాడు.
“చిత్తం స్వామీ!” అంటూ ఆ పదిమంది బిలబిలమంటూ భూ గృహంలోకి దిగినారు.
నిమిషాలు గడుస్తున్నాయి. లోపలి నుంచి ఏ సమాచారమూ లేదు. వెళ్లిన వారిలోంచి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. వెంట వచ్చిన సాయుధులైన సైనికులను చూసి..
“మీరు వెళ్లండి! ఆయుధాలు ధరించండి! అప్రమత్తంగా ఉండండి! ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొండి! నిర్దయగా చంపేసేయండి! తొందరగా సమాచారం ఇవ్వండి!” అన్నాడు. పన్నెండు మంది సైనికులు విచ్చుకత్తులతో లోపలికి దిగినారు. ఫలితంలో మార్పు లేదు!
ఎవ్వరూ తిరిగిరాలేదు. అలక్కుడి భృకుటి ముడిపడింది. లోపల ఏదో జరుగుతున్నదని అర్థమవుతున్నది కానీ, ఏం జరుగుతున్నదో ఊహకు అందడం లేదు!
ఇక తానే స్వయంగా రంగంలోకి దిగక తప్పదని నిర్ణయించుకున్నాడు అలక్కుడు. అయితే ముందు దిగిన వారిలాగా కాకుండా, కొత్త పద్ధతిలో దిగడం సురక్షితం అనిపించింది!
తాను దిగడానికి ముందు.. ఒక గుర్రపు జీనుకు గుడ్డలు చుట్టి, దానిని భూ గృహంలోకి విడిచినాడు. నాలుగు అడుగులు లోపలికి పంపగానే, ఇద్దరు బలిష్ఠులైన ఆటవికులు ఆ జీనుని మనిషి అనుకొని గబుక్కున పక్కకు లాక్కునిపోయి, మీద పడి చంపబోయినారు. ఆ వెంటనే మరో ఇద్దరు మనుషులు అలక్కునిపై దాడి చేయడానికి ప్రయత్నించడం గమనించి, ఒడుపుగా తప్పించుకొని.. వాళ్లలో ఒకణ్ని కత్తితో గాయపరిచి, మరొకణ్ని కాలితో దూరంగా తన్నినాడు. చుట్టూ పరికించినాడు.
అంతకుముందు తన మనుషులు కట్టిపడేసిన పోటిసుని ప్రియురాలు.. ఇప్పుడు విలాసంగా కూర్చొని, వినోదం చూస్తున్నది. చాలామంది ఆటవికులు ఈటెలు, బాణాలతో పైనబడి చంపడానికి సిద్ధంగా ఉన్నారు…
నలుగురు మనుషులు హఠాత్తుగా పైన పడ్డారు. గాయాలను లెక్కచేయకుండా వాళ్లను నిలువరిస్తూనే, ఆ యువతి వద్దకు చేరుకొని, మెరుపు వేగంతో ఆమెను ఒడిసి పట్టుకున్నాడు అలక్కుడు. కత్తిని ఆమె మెడకు ఆనించినాడు.
“మీరు అతి తెలివి ప్రదర్శిస్తే ఈమె గొంతు తెగుతుంది! ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపొండి!” అని గట్టిగా అరచినాడు.
భూ గృహం పైన ఉన్న అలక్కుని సైన్యానికి, పోటీసునికి, సవరసత్తికి… లోపల ఏం జరుగుతున్నదో అనే ఆందోళన అధికమైంది.
పోటిసుడు అలక్కుని మనుషులను ఉద్దేశించి ఇట్లా అన్నాడు..
“వీరులారా! మీకు ఈ నమ్మినబంటు పోటిసుని గౌరవపూర్వక వందనాలు!”
ఆ మాటలకు అక్కడున్న సుమారు ఎనభై మంది సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొందరు ముభావంగా ఉన్నారు; కొందరి మొహాల్లో నవ్వు విరిసింది; చాలామంది మొహాల్లో ఒక కొత్త కాంతి కనిపించింది. అందుకు కారణం… ఎప్పుడూ వాళ్లు వందనాలు చేయడమే గానీ, అందుకోవడం అదే మొదలు!
పోటిసుడు ప్రసంగాన్ని కొనసాగించినాడు…
“యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయేది సైనికులే! అంటే మనమే! క్షతగాత్రులం అవుతాం; అంగవిహీనులం అవుతాం; శరీరం రోగాల బారిన పడుతుంది; చాలామందిమి ప్రాణాలను కోల్పోతాం! మనం ఈ ప్రాణాలను ఎవరికోసం బలి పెడుతున్నామో ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా?”.. ఈ మాటలు వాళ్ల మీద పనిచేస్తున్నట్లు ముఖ కవళికలు చెబుతున్నాయి.
“మీ కళింగతో అశోకుడు జరిపిన యుద్ధంలోనే అనేకమంది మీవంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం; వాళ్ల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోవడం; కాళ్లు, చేతులు, కన్నులు పోగొట్టుకున్న సైనికుల ఆర్తనాదాలతో యుద్ధభూమి రుద్రభూమిగా మారడం… ఇవన్నీ చూసిన అశోకుడు యుద్ధం కంటే శాంతి గొప్పదని గ్రహించి, బుద్ధుని మార్గాన్ని అనుసరించినాడు. అప్పటినుంచి కళింగులు కూడా యుద్ధాన్ని నివారించినారు. శాంతికాముకులై జీవించినారు. ప్రజలను కన్నబిడ్డలుగా భావించి ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. మీ ప్రస్తుత రాజు కళింగాదిత్యుడు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు! ఆయన పాలనలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా…?”
సైనికుల్లో గుసగుసలు మొదలైనాయి.
“మరి రాజుగారి శాంతియుత పాలనలో నుంచి ఈ హింసాయుత పరిస్థితులు ఎందుకు పుట్టుకొచ్చినాయో ఆలోచించినారా? ఏ రాజు కోసం మీరు సైనికులుగా మారి ఆయుధాలు చేతబట్టినారో ఆ ఆయుధాలు అదే రాజుగారికి వ్యతిరేకంగా సంధించడం సరైనదేనా? క్షత్రియుడైన వాడు, సైనికుడైన వాడు, వీరుడైన వాడు, ఆయుధం ధరించిన వాడు యుద్ధం చేయవలసిందే! అదే న్యాయం! కానీ, ఆ యుద్ధం దేనికోసం చేస్తున్నాం? ఎవరి కోసం ప్రాణాలు ఇస్తున్నామో కూడా మనకు తెలియాలి కదా! సైనికుల కంటే ముందు మనం మనుషులం కదా!”
ఆ మాటలు వాళ్ల మీద తీవ్రంగా పనిచేస్తున్నాయని వాళ్ల ముఖాలు చెబుతున్నాయి. పోటిసుడు ఇంకా ఇట్లా కొనసాగించినాడు…
“రాజు గారి సకల సంపదలు; బలం; బలగం ప్రజలకు మేలు చేయడం కోసమే వినియోగించాలి! యుద్ధం కూడా ప్రజల మేలు కోసమే జరగాలి; రాజు.. ప్రజల కోసం జీవిస్తే; ప్రజలు, సైనికులు.. రాజు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు! మీ నాయకుడు మీ సంక్షేమం కోసం పాటుపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించండి…! అసలు మీ నాయకుడు అంటే… మీ రాజు ఎవరు? కళింగాదిత్యుడా? ఈసాణుడా? ఎవరి కోసం మీరు పోరాడాలి? దేనికోసం పోరాడాలి?… బాగా ఆలోచించుకుని పని చేయండి!” అన్నాడు.
సైనికుల్లో కలకలం అధికమైంది! పోటిసుణ్ని ఎంతో అభిమానంతో చూసింది సవరసత్తి. అతని మాటలు విన్న తర్వాత ఆమె అభిమానం వేయి రెట్లు అధికమైంది. ‘ఒక సామాన్యుడైన బంటులో ఇంత జ్ఞానమా!’ అనుకొని మనసులోనే అతనికి నమస్కరించింది. ఇంతలో భూ గృహంలో నుంచి చంద్రహత్థిని పట్టుకుని బయటికి వచ్చినాడు అలక్కుడు. అతని చేతిలో ఆమె విలవిల్లాడుతూ ఉన్నది.
“చంద్రా…..!” నరాలు తెగిపోయేంత బాధతో అరచినాడు పోటిసుడు. అతని కన్నులు దుఃఖపు చెలిమ్లై… క్రమంగా రక్తం రంగును పులుముకుంటున్నాయి. ఎదురుగా తనను మించిన బలశాలిని చూసి ఒక్కసారిగా బిత్తర పోయినాడు ఈసాణుడు.
“ఎవరు నీవు?” అన్నాడు; భయం, ఆశ్చర్యం మిళితమైన గొంతుతో. “అప్పుడే మరిచిపోయినావా సేనాధిపతీ! పది రోజుల క్రితం నిన్ను కలిసి అస్మకరాజు సందేశాన్ని అందించినాను…” గుర్తు చేసినాడు
మలయసేహరుడు. అతను అస్మకరాజు సౌరిసంబ వారి సేనాధిపతి! ఠక్కున గుర్తుకు తెచ్చుకున్నాడు ఈసాణుడు. పది రోజులకు ముందు వీడు తనను కలిసినాడు! ‘మీ వద్ద మా సార్ధవాహుడు కుసుమశ్రేష్ఠి బందీగా ఉన్న సమాచారం అందింది. వారికి ఏ హానీ తలపెట్టకుండా వెంటనే వదిలిపెట్టండి! చర్చించుకోదగిన అంశాలు ఉంటే ముఖాముఖి మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ, సౌరిసంబ మహారాజు పంపిన సందేశం తీసుకుని వచ్చినాడు!
‘ఆ విషయం నిజమేనని, రెండు రోజుల్లో వారిని పంపుతామని సమాధానం కూడా ఇచ్చినాను. ఆ వెంటనే మనుషులను పంపి వాడిని మట్టు పెట్టించినాను…! మరి వీడెవడు?’ అనుకుంటూ, బుర్ర గోక్కున్నాడు ఈసాణుడు!
“చచ్చినవాడు బతికి ఎలా వచ్చినాడని ఆలోచిస్తున్నావు కదా!” అతని మనసును చదివేస్తున్నట్లే అన్నాడు మలయసేహరుడు.
“నీ లాగే నీ మనుషులు! ఆశకు లొంగిపోతారు; అవకాశాలకు అర్రులు చాస్తారు; ప్రలోభాలకు బానిసలవుతారు… హుఁ! నీవు సేనానిగానే అసమర్థుడవు ఈసాణా! ఇక రాజుగా ఏం సాధించగల ననుకున్నావు? చేసిన వినాశనం చాలు! ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కళింగాదిత్య మహారాజు కాళ్లు పట్టుకో! బతికి పోతావు! నీవు మాట మనిషివి కాదని, అసలు మనిషివే కాదని నాకు ముందే అర్థమైంది! అందుకే వార్తాహరుని పంపకుండా, సర్వ సైన్యాధ్యక్షుడైన ఈ మలయసేహరుడు… అంటే నేనే రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఇది మా రాజు గారికి ప్రజల మీద గల ప్రేమకు నిదర్శనం! మా సాహసం మా రాజ్యం పట్ల, మా మహారాజు గారి పట్ల మాకు గల భక్తికి సాక్ష్యం!” అన్నాడు సర్రున ఒరలో నుంచి కత్తి బయటికి తీస్తూ…
“నిన్ను ఆరోజే మా వాళ్లు చంపి ఉంటే ఈరోజు ఈ దుస్థితి దాపురించేది కాదురా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరాసరి పులిబోనులోకే వచ్చినావు కదా!” అంటూ యుద్ధానికి సిద్ధమైనాడు ఈసాణుడు. ఒక చేతిలో ఈటె, మరొక చేతిలో ఖడ్గం ధరించిన మలయసేహరుడు మెరుపు వేగంతో అక్కడున్న నలుగురినీ కలయితిరిగి, యధా స్థానానికి చేరుకున్నాడు! మరుక్షణం చూస్తే… జయసేనుడు, వామదేవుడు, అవణాయరు బంధ విముక్తులైనారు! సౌగంధిక చుట్టూ ఉన్న భటులు నేల కూలిపోయినారు!
“దేవా! నాకు కూడా ఒక ఖడ్గం ఇవ్వు! నా ప్రణయ రూపంలో దాగిన ప్రళయ శక్తిని చూపిస్తాను!” కొంగు నడుముకు చుట్టుకుంటూ సివంగిలా గర్జించింది సౌగంధిక. ఆమె మాటలు మిగతా ముగ్గురిలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపినాయి.
“ఇంకా చూస్తున్నారు ఏమిరా? ఈ నలుగురినీ ముక్కలు ముక్కలుగా నరికేసెయ్యండి!” మహోగ్రంగా అరచినాడు ఈసాణుడు.
“నరికేయండిరా! కానీ, మమ్ములను కాదు! ఈ రాజద్రోహి ఈసాణున్ని. అమాయకుడైన కళింగాదిత్య మహారాజును వంచించి, బంధువైన ఖరహర ప్రియ మహారాణిని మాయ చేసి, పందికొక్కులా కళింగ సంపదనంతా దోచుకుని తిన్న వీడిని వధిస్తేనే మన రాజ్యం బాగుపడుతుంది! రండి! రాజ్యం కోసం పోరాడేవాళ్లు మా పక్షాన నిలబడండి! రాజ్య ద్రోహులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించండి!”..
అవణాయరు మాటలు సైనికుల మీద బాగా పనిచేసినాయి. ఉన్న సైన్యం రెండుగా చీలిపోయింది! ధర్మానికి-అధర్మానికి; న్యాయానికి-అన్యాయానికి; రాజభక్తికి-రాజద్రోహానికి మధ్య పోరు మొదలైంది… ఆ సన్నివేశం వీరవరులైన జయసేన వామదేవులలో కోటి రెట్ల బలం నింపింది! సైనికుల్లో ప్రభుభక్తిని రగుల్కొలిపింది! సౌగంధికను ఆడ పులిని చేసింది. యుద్ధం క్షణక్షణానికీ తీవ్రతరమైంది!
తన బలమూ, బలగమూ క్షీణిస్తున్న విషయం ఈసాణుడికి అర్థం కాసాగింది. ఇంకొక్క ఘడియ కూడా పోరాడలేనన్న నిజం అతను గ్రహించేసినాడు. ‘ఇక్కడి నుంచి తప్పించుకొని కోటను చేరుకోవాలి. కోటలోని సైన్యం అంతా వస్తే ఉప్పెనలో కొట్టుకొని పోయే కుక్కల్లాగా వీళ్లంతా కొట్టుకొని పోతారు!’ ఈ ఆలోచన రాగానే పిక్క బలం చూపినాడు ఈసాణుడు! అప్పటికే మూడు వంతుల సైనికులు అతనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈసాణుడు పరిగెత్తడం చూసి, ఆ మిగిలిన వాళ్లు కూడా రాజభక్తిని ఆశ్రయించినారు! అందరూ కళింగాదిత్య మహారాజు పక్షం అయినారు!
ఈసాణుణ్ని వదలకుండా వెంబడించ సాగినాడు అవణాయరు!
“మహాసేనానీ! మీ మేలు జన్మజన్మలకూ మరచిపోలేము!” అన్నాడు జయసేనుడు. తలవంచి నమస్కరిస్తూ మలయసేహరునికి.
“జయసేనా! మీరు మాత్రం సామాన్యులా? మీ ధైర్య సాహసాలు అనుపమానం! మీ కుటుంబాన్ని మన మహారాజుగారు తమ కుటుంబంగానే భావిస్తారు. మాకు మీరంతా రాజకుటుంబమే యోధా!” అంటూ అంతలోనే తేరుకొని..
“అవునూ… ఆవేశంతో అవణాయరు ఈసాణుణ్ని వెంబడిస్తున్నాడు. ఆ వంచకుని చేతిలో భంగపడడు కదా!” అన్నాడు.
ఆ మాట విన్న మరుక్షణం అటువైపు బాణంలా దూసుకొని పోయినాడు జయసేనుడు.
“సేనాపతి గారూ! మా కుసుమ శ్రేష్ఠులు క్షేమంగా ఉన్నట్లే కదా!” ఏదో అనుమానం, భయం వామదేవుని గొంతులో.
“మీకు ఆ భయం అవసరం లేదు నాయనా! కుసుమ శ్రేష్ఠుల వారిని వాడు ఇంతవరకూ ఏమీ చేయలేదు! ఇకపై చేయగల అవకాశం లేదు! అయితే ఇప్పుడే మనం అప్రమత్తంగా ఉండాలి!” అంటూ చకచకా బాధ్యతలు పంచినాడు సేనాధిపతి మలయసేహరుడు…
“జయసేనుడు అవణాయరును రక్షించడమే కాదు; అవసరమైతే ఈసాణుడిని తెగ నరుకుతాడు! అది జరగవలసిందే! నిరపరాధి అయిన తన తండ్రిని చిత్రహింసలకు గురి చేసిన వానికి మరణ దండన విధించవలసింది అతనే! నీవు సౌగంధికను వెంట తీసుకొని చిలుకవాడకు వెళ్లు! అక్కడ సవరసత్తి, పోటిసుడు ప్రమాదంలో ఉన్నారు. నేను ఈ సైన్యాన్ని వెంటబెట్టుకొని కోటకు చేరుకుంటాను! రాజు గారిని, రాజ్యాన్ని, అన్నిటినీ మించి కుసుమ శ్రేష్ఠుల వారిని కాపాడటం నా విధి!” అంటూ…
“దేశభక్తులైన మహావీరులారా! మీరు వంద మంది అయినా పదివేల మందితో సమానం! రండి! నన్ను అనుసరించండి!” అని పిలుపునిచ్చినాడు. అందరూ జయ జయ ధ్వానాలు చేస్తూ మలయసేహరుని వెంట నడిచినారు!
సౌగంధిక, వామదేవుడు పరస్పరం ప్రేమ నిండిన కనులతో చూసుకున్నారు.
(సశేషం)
– దోరవేటి 89788 71961