కాఠ్మాండు: యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల (Social Media) నిషేధంపై నేపాల్ ప్రభుత్వం (Nepal Govt) వెనక్కి తగ్గింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్‌తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధింస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ‘జనరేషన్ జడ్ డిమాండ్’ (Gen Z Protests) మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు.
సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ నేపాల్ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. రెగ్యులేటరీ నిబంధనల మేరకు తాము యాప్‌ల నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కేందుకు చేపట్టిన సెన్సార్షిప్ చర్యగా యువజనులు ఆరోపించారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను అడ్డుకుని, సోషల్ మీడియా యాప్‌లను నిషేధించినప్పటికీ జనరేషన్ జెడ్ ఉద్యమకారులు టిక్‌టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేలాదిమంది యువజనులను సమీకరించారు.
వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. మైటీఘర్ మండాలా వద్ద మొదలైన ర్యాలీ పార్లమెంట్ భవనం వైపు దూసుకువెళ్లింది. నిరసనకారులు పార్లమెంట్ భవనానికి చేరువ అవుతుండగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహోదగ్రులైన నిరసనకారులు బ్యారికేడ్లను ఛేదించుకుంటూ ముందుకు దూకారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు జరపడంతో 20 మంది నిరసనకారులు మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. నిరసనలు కాఠ్మాండుతోపాటు ఇతర నగరాలకు కూడా విస్తరించడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు.