హైదరాబాద్: పలువురు సినీ ప్రముఖులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ను (Excise Constable) టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టుబుల్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు.. ఇన్స్పెక్టర్గా చెప్పుకుంటూ సినీ సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి మరీ వారిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇంట్లో డ్రగ్స్ దొరికాయంటూ కేసుల్లో ఇరికిస్తానని వేధించాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉమామహేశ్వర రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు ఒంటరిగా ఈ వ్యవహారం జరిపాడా..? లేక మరెవరైనా వ్యక్తులు లేదా అధికారులు అతనికి తోడుగా ఉన్నారా..? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. అతడు ఇంతకాలం ఎవరి ఇళ్లకు వెళ్లాడు, ఎవరిని బెదిరించాడు, ఆర్థిక లావాదేవీలు జరిగాయా వంటి అంశాలను వెలికితీస్తున్నారు.