Sridevi | టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలు భాషలలో నటించి సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన దివంగత నటి శ్రీదేవి గురించి ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ, ఆమె చేసిన త్యాగాలు, కృషి, నిబద్ధత గురించి వివరించారు. బోనీ కపూర్ మాట్లాడుతూ .. “శ్రీదేవికి బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన సమయంలో హిందీ భాష రాకపోయినా, కెరీర్‌కు ఆటంకం కలగకుండా ఉండేందుకు కోచ్‌తో కలిసి భాషను నేర్చుకుంది. మొదటి ఆరు సినిమాలకు వాయిస్ డబ్బింగ్ చెప్పించుకుంది. కానీ తర్వాత తనే మాట్లాడాలని పట్టుదలతో హిందీతో పాటు మలయాళం కూడా నేర్చుకుంది,” అని చెప్పారు.
‘మామ్’ సినిమాలో ఆమె పాత్రకు మలయాళంలో డబ్బింగ్ చెబుతూ, ప్రతి మాటకు లిప్ సింక్ ఉండేలా చూసుకుంది. మలయాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ సమక్షంలో తన డబ్బింగ్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుందని వెల్లడించారు. ఇది ఆమె ఉన్నత స్థాయి ప్రొఫెషనలిజానికి ఉదాహరణ అని బోనీ అన్నారు. ‘మామ్’ సినిమా మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్‌ని తీసుకోవాలని బోనీ కపూర్ నిర్ణయించగా, రెహమాన్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో, శ్రీదేవి తన రెమ్యూనరేషన్లో రూ.70 లక్షల వరకు తగ్గించుకుని ఆ మొత్తాన్ని రెహమాన్‌కు ఇవ్వమని చెప్పింది. “ఆ ఒక్క మాటతో మా పని చాలా సులభమైంది” అని చెప్పారు బోనీ.
‘మామ్’ షూటింగ్ ఎక్కువగా జార్జియా, నోయిడా ప్రాంతాల్లో జరిగిందని, అక్కడ శ్రీదేవి తన హోటల్ రూమ్‌లో కూర్చొని స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని బోనీ కపూర్ గుర్తు చేసుకున్నారు. “ప్రతి సినిమా పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయే వాళ్లు ఎక్కువ” అని ఆయన అన్నారు. 2017లో విడుదలైన ‘మామ్’ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ అయింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఏకంగా రూ.175 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇదే శ్రీదేవి స్టార్ డమ్‌కు నిదర్శనమని చెబుతున్నారు. 2018లో శ్రీదేవి అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఇది ఆమె చివరి సినిమాగా మిగిలిపోయింది. హిందీ సినిమా చరిత్రలో కూడా ‘మామ్’ ఒక మైలురాయిగా నిలిచింది.