కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఖమ్మంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. బాధితులు లబోదిబోమంటున్నా కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇంకా తెల్లవారకముందే ఆ కుటుంబాలన్నీ గాఢనిద్రలో ఉండగానే వారి ఇండ్లపై బుల్డోజర్లను ప్రయోగించింది. మంగళవారం ఉదయం 5గంటలకే వాహనాల పెద్ద పెద్ద శబ్ధాలకు లేచిచూసిన కాలనీ ప్రజలకు బల్డోజర్లు, వందలాది మంది పోలీసులు కళ్లముందు కనిపించారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఐనప్పటికీ అధికారుల రాకను గమనించి కాలనీ జనమంతా ఒక్కటై మొదట కర్రలతో ఎదురుదాడికి ప్రయత్నించారు. సుమారు గంటసేపు వెలుగుమట్లకు చెందిన భూదాన్ భూముల ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసులు, రెవెన్యూ అధికారులెవ్వరినీ కాలనీలోకి ప్రవేశించకుండా కాలనీవాసులంతా కలిసి కర్రలతో నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు, పోలీసులు మైకులతో చేసిన హెచ్చరికలు, బెదిరింపులకు నిరుపేదలు వెనక్కితగ్గారు. దీంతో గంటల వ్యవధిలోనే భారీ పోలీస్ బందోబస్తు నడుమ కాలనీలో ఉన్న సుమారు ఏడువందల ఇళ్లను నేల మట్టం చేశారు. ఇళ్లు కోల్పోతున్న పేదలు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నా వారి ఆర్తనాదాలు అధికారులకు వినిపించలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శన మని కాలనీ ప్రజలు దుమ్మెత్తిపోయడం కనిపించింది.
– రఘునాధపాలెం, ఫిబ్రవరి 24

ఖమ్మం నగర శివారు కలెక్టరేట్‌కు సమీపంలోని భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల పేరుతో మంగళవారం ఒక్కసారిగా కూల్చివేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నిరుపేదల ఇళ్లకు ఎసరుపెట్టింది. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూలో ఉన్న భూదాన్ భూముల్లో గత 12 ఏళ్లుగా ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఇళ్లులేని నిరుపేదలు గుడిసెలు, కొంతమంది పక్కా ఇళ్లు కట్టుకొని నివాసముంటున్నారు. దీంతో వెలుగుమట్ల ప్రాంతం ఓ పెద్దకాలనీగా ఏర్పాటైంది.

కాలనీ ప్రజలంతా ఒక్కటై తమకు పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నారు. అయితే భూదాన్ భూముల వివాదం కోర్టులో నడస్తుండటంతో నాడు కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడి పేదలకు పట్టాలు ఇవ్వడం సాధ్యపడలేదు. ఈక్రమంలో స్థానికంగా భూములను కలిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉంటున్న పేదలను అక్కడ లేకుండా చేయాలనే ప్రయత్నాలను సాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అనుకూల అమాత్యుడూ అదే పార్టీలో కొనసాగడం అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొచ్చిన అంశంగా మారింది. గతేడాది సైతం అమాత్యుడి సహాయంతో ఓ దఫా రెవెన్యూ, పోలీసులను ప్రయోగించి కాలనీలోని పలు ఇళ్లను కూల్చివేయించారు.

అక్కడ నివసించే బడుగుబలహీన వర్గాలకు చెందిన పేదల ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తేనే తమ భూములకు ధరలు పెరుగుతాయనే కుటిలబుద్ధితో కొందరి పేర్లతో కోర్టుల్లో కేసులు సైతం వేయించారు. అక్కడ ఇళ్లు కట్టుకున్న పేదలకు ఖాళీ చేయాలని నోటీసులు సైతం జారీ చేయించారు. అయినా ఖాళీ చేయకపోవడంతో తాజాగా కోర్టు ఆదేశాల పేరుతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి వేలాది పోలీస్ బందోబస్తు నడుమ పేదలు కట్టుకున్న ఇళ్లను మంగళవారం నేలమట్టం చేయించారు.

పేదలను భయబ్రాంతులకు గురిచేసి ఖాళీ చేయించాలనే ఆలోచనతో ఖమ్మంజిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు ఆరు వందల మంది పోలీసులు బలగాలను భారీగా రంగంలోకి దింపారు. కాలనీలో భయాత్మకమైన వాతావరణాన్ని తీసుకరావడంతో కాలనీ ప్రజలు చేసేదిలేక కొంతమంది స్వచ్ఛందంగానే ఖాళీ చేశారు. మరికొంతమందిని అధికారులు ప్రత్యేక వాహనాలను సమకూర్చి పేదలను సామాన్లతోపాటు ముందస్తుగా ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా పది మంది ఇళ్లకు కోర్టు అర్డర్ ఉన్న కారణంగా ఆ ఇండ్లను కూల్చివేతల నుంచి మినహాయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యకు నిరుపేదలు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఎంతో రెక్కల కష్టం చేసి, చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్ముతో ఇళ్లు కట్టుకున్నామని ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ చేయించి కూల్చివేయించడం సరికాదని ఆవేదన చెందారు. బలంవంతంగా ఖాళీ చేయించే క్రమంలో పలువురు నిరుపేదలు ఆర్తనాదాలు చేశారు. అధికారులు, పోలీసులపై బూతుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, ఇది ముమ్మాటికీ బల్డోజర్ పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ రోదించారు. ప్రజాపాలన అందిస్తామంటే మురిసిపోయామని కానీ రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన అంటూ దుమ్మెత్తి పోశారు.
గత 15ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వీరాభిమానిగా పనిచేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొంగులేటిని ఎంపీగా గెలిపించేందుకు ఎంతో కృషి చేసిన. కానీ మంత్రి పొంగులేటి ఆయన్ని నమ్ముకున్న కార్యకర్త గుండెలపైనే తన్నాడు. నా కుటుంబం ఉసురు తప్పక తగులుతుంది. 15ఏళ్లుగా ఆయన కార్యకర్తగా ఊడిగం చేసిన. రూ.25 లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని నేలమట్టం చేసి నన్ను, నా కుటుంబాన్ని వీధిన పడేసిండు.
– బలి శ్రీనివాసరావు, ఇల్లు కోల్పోయిన బాధితుడు
పేదలకు చెందిన భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను బలవంతంగా ఖాళీ చేయించింది. ఇక్కడ ఇళ్లు కట్టుకున్న పేదలు హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్చు సైతం ఇచ్చింది. అధికారులెవ్వరూ అడుగుపెట్టొద్దనే ఆదేశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలను చేపడుతున్నది. దీనిపై లంచ్ మోషన్లో రిట్ పిటీషన్ వేస్తున్నాం. కూల్చివేతలు తాత్కాలికమే భవిష్యత్తులో ఆ భూములన్నీ పేదలకే చెందుతాయి.
– మేకల సుగుణారావు, ఖమ్మం సీనియర్ న్యాయవాది
భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసముంటున్న పేదల గుడిసెలను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా..? వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లతో తెల్లవారుజామున దాడి చేయడమేంటి..? ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వపు దుర్మార్గపు చర్య. బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. అర్హులైన పేదలందరికీ పట్టాలివ్వాలి. లేదంటే పేదలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రేవంత్ సర్కారుకు గట్టి బుద్ధిచెబుతాం.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
పేదల గుడిసెలను కూల్చడం అమానుషం. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు స్వయంగా మంత్రి రంగంలోకి దిగి పోలీసు బలగాలను దుర్వినియోగం చేయడం అత్యంత దురదృష్టకరం. భూదాన్ భూములపై జిల్లా మంత్రి సన్నిహితులు ఎప్పటినుంచో కన్నేశారు. పేదలను నిరాశ్రయులను చేసి రోడ్డుపైకి నెట్టివేయడం మానవత్వాన్ని మరిచిన చర్య. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
పేదల ఇండ్లు కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్దం. ఏండ్ల తరబడి నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయం కల్పించకుండా ఇళ్లను కూల్చివేసి రోడ్డున పడేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. అప్పులు చేసి, చెమటోడ్చి కట్టుకున్న ఇళ్లను క్షణాల్లో నేలమట్టం చేయడం, పేదల గుండెలను పగులగొట్టే దుశ్చర్య. మీడియాను సైతం రానివ్వకుండా అడ్డుకోవడం అనైతికం. తక్షణమే ప్రతి కుటుంబానికి స్థలంతోపాటు పక్కా ఇల్లు మంజూరు చేయాలి.
– నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తోంది. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషం. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. పోలీస్ బలగాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. నిరాశ్రయులైన పేదలకు తక్షణమే న్యాయం చేయాలి. లేకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేస్తాం.
– లింగాల కమల్‌రాజు, జడ్పీ మాజీ చైర్మన్