జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఆరు రోజుల క్రితం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గిరక తాటి మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు రక్షణ లేక విరిగి ఎండిపోయిన దుస్థితిలో కనిపిస్తున్నాయి. ఈ మొక్కల సంరక్షణ చూడాల్సిన నిర్వాహకులు వాటి రక్షణ మరిచారు. ఈ మొక్కలను ఎవరైనా ఆకతాయిలు కావాలని విరిచారా లేక జంతువులు ఏవైనా తిన్నాయా అనేది తెలియదు కానీ, ప్రభుత్వం చేస్తున్న పని కొందరి నిర్లక్ష్యం కారణంగా లక్ష్యానికి చేరువ కాకుండా పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏకంగా జిల్లా కలెక్టర్ నాటిన మొక్కలకే రక్షణ లేదంటే ఇక జిల్లాలోని మిగతా చోట్ల వన మహోత్సవ కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతుందన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా నాటిన ప్రతి మొక్క చుట్టూ ముళ్ల చెట్లతో రక్షణ కవచాలు ఏర్పాటు చేసి వాటి ఎదుగుదలకు అవసరమైన నీటిని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.