Medak Baby Sale | మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. డబ్బుల కోసం పుట్టిన వారం రోజులకే కన్న కొడుకును తల్లిదండ్రులు అమ్ముకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన మహిళ గత నెల 10వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డబ్బులు అవసరం కావడంతో వారం రోజులకే ఆ బిడ్డను కామారెడ్డి జిల్లాక చెందిన దంపతులకు అమ్మేశారు. అయితే, అంగన్వాడీ కేంద్రం నుంచి గుడ్లు, ఆహారం తీసుకోవడానికి గిరిజన మహిళ వెళ్లకపోవడంతో ఆరా తీసేందుకు అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వారింటికి వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులు.. సదరు గిరిజన దంపతులను వేరే గ్రామంలో గుర్తించారు. వారిని పట్టుకుని బిడ్డ ఏదని ప్రశ్నించగా.. కామారెడ్డికి చెందిన దంపతులకు బిడ్డను రూ.1.7 లక్షలకు అమ్మేసినట్లు వెల్లడించారు. దీంతో వారిని తీసుకెళ్లి హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించారు.