బూర్గంపహాడ్, జూలై 28 : రుణం ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించి సైబర్ మోసంతో రూ.6.90 లక్షలకు టోకరా వేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని గౌతాపురం కాలనీకి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి రుణం ఇప్పిస్తానని ఆమెకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యక్తిగత వివరాలను సేకరించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపుతూ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బయపడిన ఆ మహిళకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాల ద్వారా విడతల వారీగా రూ.6.90 లక్షలు స్వాహా చేశాడు.
అయితే బాధిత మహిళ సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా బాధిత మహిళ బ్యాంకు ఖాతాను బ్యాంక్ అధికారులతో మాట్లాడి హోల్డ్‌లో పెట్టించడంతో రూ.3.30 లక్షలు బదిలీ కాకుండా నిలుపుదల చేయడంలో సఫలమయ్యారు. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రుణాల పేరుతో వ్యక్తిగత పత్రాలు, ఆధార్, పాన్ వివరాలు అపరిచితులకు ఇవ్వొద్దని, మార్ఫింగ్ ఫొటోలు, సైబర్ బెదిరింపులు ఎదురైతే తక్షణమే పోలీసులను లేదా సైబర్ క్రైం హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు.