Wildfires : ఫ్రాన్స్, స్పెయిన్ (France, Spain) సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు (Wildfire) విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా.. స్పెయిన్‌లో 1,25,000 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్ ప్రాంతంలో కోట్ల విలువచేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ భారీ కార్చిచ్చు నవంబర్ (November First week) మొదటి వారం వరకు కొనసాగవచ్చని యూరోపియన్ యూనియన్ అధికారులు హెచ్చరించారు.
ఐరోపాలో అగ్నికీలలవల్ల ఈ ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరాలలో ఒకటిగా నిలిచిపోతుందన్నారు. ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతుండటంతో ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్‌లలో కార్చిచ్చుల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో ప్రారంభమైన ఈ అగ్నికీలలు పలు నగరాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దాంతో ఫ్రాన్స్‌పై భారీ పొగ మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో వీటిని ఆర్పడం సవాలుగా మారింది.
కార్చిచ్చును ఎదుర్కోవడానికి యూరోపియన్ కమిషన్ సమన్వయంతో ఫ్రాన్స్‌కు ఏడు అగ్నిమాపక విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, స్పెయిన్‌కు ఆరు విమానాలు, మూడు అగ్నిమాపక బృందాలను పంపారు. భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో ఇవి అగ్ని సుడిగుండాలుగా మారే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో ఫ్రాన్స్‌లో సుమారు రెండు లక్షల మంది, స్పెయిన్‌లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అడవుల్లోని జంతువులు మంటల వేడిని తాళలేక రోఢ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెంపుడు జంతువులను కూడా ప్రజలు బయటకు వదిలేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని, వీటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అగ్నికీలలు ఆర్పడానికి వేలమంది సిబ్బంది పని చేస్తున్నారని.. వందల సంఖ్యలో హెలికాప్టర్లతో నీళ్లు వెదజల్లుతున్నారని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.