ఇస్లామాబాద్: కోట్లాది మంది దేశ ప్రజలపై పాకిస్థాన్ నిఘా(Pakistan Spying) పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఆ స్పైయింగ్ జరుగుతోంది. చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్‌వాల్ ద్వారా పాకిస్తాన్లో సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. మంగళవారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేశారు. చైనీస్, పాశ్చాత్య టెక్నాలజీ ద్వారా నిర్మించిన మానిటరింగ్ నెట్‌వర్క్‌తో ప్రజలపై నిఘా పెడుతున్నట్లు ఆమ్నెస్టీ పేర్కొన్నది. పాకిస్థాన్‌లో పొలిటికల్, మీడియా స్వేచ్ఛపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.
లాఫుల్ ఇంటర్సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఐఎంఎస్) ద్వారా సుమారు 40 లక్షల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే సామర్థ్యం పాకిస్థాన్ నిఘా ఏజెన్సీలకు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎంఎస్ 2.0 ఫైర్‌వాల్ ద్వార సుమారు 20 లక్షల యాక్టివ్ యూజర్లను ఒకేసారి స్తంభింపచేసే అవకాశాలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొన్నది. రెండు రకాల మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయని, కాల్ ట్యాపింగ్.. టెక్ట్స్‌లను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలుసుకోవచ్చు అని, దేశవ్యాప్తంగా వెబ్సైట్లు, సోషల్ మీడియాను బ్లాక్ చేసే విధంగా టెక్నాలజీ కూడా ఉందని ఆమ్నెస్టీ చెప్పింది.
ఎల్ఐఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు కనెక్ట్ కావాలని దేశంలోని నాలుగు మొబైల్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆమ్నెస్టీ టెక్నాలజీ నిపుణుడు జూరీ వాన్ బెర్జ్ తెలిపారు.