ఇల్లెందు, డిసెంబర్ 10 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవారం రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అంతా సహకరించాలని కోరారు. ఈ క్రింది సూచనలు తప్పక పాటించాలన్నారు.
– డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ నిషేధం
– ప్రతి ఓటర్ తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఓటు వేయాలి
– ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలు నేరాలు
– ప్రచారం నిర్ణయించిన సమయాల్లో మాత్రమే చేయాలి
– స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అనుమతి ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించాలి
– పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, ప్రచార సామగ్రి తీసుకెళ్లరాదు
– క్యూలో నిలబడి శాంతియుతంగా ఓటు వేయాలి
– రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లరాదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి గురించి, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే తెలపాలన్నారు. డయల్ 100 లేదా ఇల్లెందు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సంబురాలు, బాణాసంచా, ర్యాలీలు, భారీ సమావేశాలు పోలీస్ అనుమతి లేకుండా నిర్వహించరాదన్నారు. ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎస్హెచ్ఓ తాటిపాము సురేశ్, ఎస్ఐ హాసినా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.