రామవరం, డిసెంబర్ 10 : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలని, తప్పుడు, వివాదాస్పద, అపోహలు రేకెత్తించే పాంప్లెట్స్ పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి .ప్రతాప్ హెచ్చరించారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చుంచుపల్లి, సుజాతానగర్ మండలాల పరిధిలో గల 13 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఒకరినొకరు విమర్శించే విధంగా ప్రవర్తించడం, అలాగే 3 ఇంక్లైన్ గ్రామ పంచాయతీలో ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలతో పాంప్లెట్స్/జిరాక్స్ లు ఇండ్లలో వేయడం వంటి చర్యలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.
ఈ విధమైన చర్యలు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే చట్టవిరుద్ధ చర్యలు కావున, ఇలాంటి పనులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయన్నారు. అదేవిధంగా దీనికి బాధ్యత గలవారి పట్ల ఎన్నికల అర్హత రద్దు చేయాలనే అంశాన్ని జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కావునా ప్రతి ఒక్కరు శాంతియుతంగా, చట్టబద్ధంగా తమ ప్రచారాన్ని కొనసాగించుకోవాలని సూచించారు.