న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పీఎంవో కాంప్లెక్స్ సేవాతీర్థ్ధ్లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతమున్న కేరళ రాష్ట్రం పేరు మలయాళంలో ‘కేరళం’ కాబట్టి దానిని కేరళంగా మార్చాలంటూ కేరళ శాసనసభ గతంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
ముడి జనపనార కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్రం పెంచింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ కనీస మద్దతు ధరను రూ.5,925గా నిర్ణయించింది. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న ఉత్తర-దక్షిణ మెట్రో కారిడార్‌ను గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్‌కు 3.33 కి.మీ మేర పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. నాలుగేండ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడు స్టేషన్లు ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.1,067.35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
దేశంలో రూ. 9,072 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో 307 కి.మీ పొడవున 8 జిల్లాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,677 కోట్లతో పౌర ఎన్‌క్లేవ్‌ను విస్తరించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.