హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాను నడిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. డిప్యుటేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతుల విషయంలో ఇప్పటికే సదరు శాఖపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వైద్యశాఖలో పనిచేసే ఉద్యోగులు సైతం తమ ఫైలు కదలలాంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే అని బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల వైద్యుల రిటైర్మెంట్ వయసు పొడిగిస్తామని చెప్పి వంద మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.3లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్లను వసూలు చేసిన వైనం ఆ శాఖలో దుమారం రేపింది. వరుస ఆరోపణలు వస్తున్నా సదరు శాఖలోని కీలక అధికారులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా వసూళ్లకు తెగబడుతుండటం విస్మయానికి గురిచేస్తున్నది. తాజాగా ఓ కీలక అధికారి మందులు, సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్, పీఎం అభిమ్ బిల్లుల చెల్లింపులతోపాటు పెనాల్టీ టెండర్ల రాయితీల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లుల చెల్లింపును ఆసరాగా చేసుకుని సదరు అధికారి భారీస్థాయిలో అవినీతికి తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆ అధికారి బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కమీషన్ కింద రూ.18 కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సదరు కీలక అధికారి బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లో రూ.600 కోట్ల వరకు బిల్లులు క్లియర్ చేయగా.. ఇందుకు రూ.18 కోట్లు కమీషన్ రూపంలో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. సదరు కీలక అధికారి అమలు పరుస్తున్న సొంత నిబంధనలతో ఏజెన్సీల నిర్వాహకులు హడలిపోతున్నట్టు తెలిసింది. కమీషన్ వసూళ్ల వ్యవహారంలో వైద్యశాఖ పెద్దలను సైతం ఆ అధికారి లెక్క చేయడం లేదని సమాచారం. కమీషన్లను తనకు తప్ప ఇంకెవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏజెన్సీలను బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. బిల్లులు క్లియర్ చేసే అధికారం తనకే ఉందని, కాబట్టి కమీషన్ మొత్తం తనకే ముట్టజెప్పాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. డబ్బులు చేతికందిన తర్వాతే బిల్లులకు లైన్ క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. కమీషన్‌తోపాటు తాను కోరుకున్న కాస్ట్లీ ‘మందు’ బాటిళ్లు సైతం ఇంటికి పంపాల్సిందే అని ఆ అధికారి ఏజెన్సీలకు హుకుం జారీచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటి నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడం కన్నా.. కీలక అధికారికి కమీషన్ ముట్టజెప్పి తమ బిల్లులు క్లియర్ చేయించుకోవడం బెటర్ అని ఏజెన్సీ నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలిసింది.
సదరు కీలక అధికారి బిల్లుల క్లియరెన్స్‌కు ఏజెన్సీల నుంచి 2 నుంచి 4% కమీషన్ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. పెనాల్టీ టెండర్ రాయితీని సైతం తనకు అనుకూలంగా మలుచుకొని ఇటీవల కొన్ని కంపెనీలకు 25శాతం రాయితీ ఇచ్చి అందులో సైతం కోట్ల రూపాయలు కమీషన్ నొక్కేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏజెన్సీల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు తన ఇంటి వద్ద ఉన్న ఓ మాల్‌ను ఆ అధికారి ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. బిల్లులు క్లియర్ కావాలంటే ముందు తనను ప్రసన్నం చేసుకోవాలని ఏజెన్సీలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. వైద్యశాఖలో ఈ అవినీతి తిమింగలం మితిమీరిన అక్రమాలపై చర్యల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి బాహాటంగా తెరలేపిన సదరు కీలక అధికారిని కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరనేది తేలాల్సి ఉన్నది