హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాజకీయాలు, పరిపాలన జోడెద్దుల వంటివి. రెండూ సమన్వయంతో పనిచేస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. కానీ.. రెండూ మిలాఖత్ అయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజాకంటకంగా మారుతుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామంటూ బయటికి చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అనేక పేద కుటుంబాలను దహించింది. దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో దూ సుకుపోతున్న తెలంగాణ ప్రస్థానాన్ని భ్రష్టుపట్టించింది. ఆకాశాన్ని తాకిన రియల్, నిర్మాణ రంగా లు హైడ్రా పుట్టుక తర్వాత నేల చూపులు చూడ టం మొదలైంది. ఒకరిద్దరు ప్రభుత్వ పెద్దల ప్రసన్నంతో భవిష్యత్తు నిర్మించుకోవాలనుకున్న శక్తులకు ఇది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మార్గం సుగమం చేసింది. హైడ్రా తీరుపై ‘నమస్తే తెలంగాణ’ మొదటి నుంచీ అక్షర సమరం కొనసాగిస్తూనే ఉన్నది. పెద్దోళ్లను వదిలి, పేదోళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందనేది బహిరంగ రహస్యం.
తాజాగా హైకోర్టు చేసిన ‘తొమ్మిది తలల సర్పం’ వ్యాఖ్యలు సంస్థ పనితీరుకు దర్పణం పట్టాయి. ఏకంగా కమిషనర్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా మనిషి మారడం లేదు, ఆయన తీరూ మారడం లేదు. కబ్జాకోరులు మాత్రమే తమపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారంటూ మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ హైడ్రా కూల్చివేతల్లో పారదర్శకత ఉంటే, ఆ బుల్డోజర్లకు పేదోళ్లు-పెద్దోళ్లు అనే తేడా లేకుంటే రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకున్న వారిని ఎందుకు వదిలిపెట్టినట్టు? ఆ కబ్జాలపై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నట్టు? కొన్నిచోట్ల రెవెన్యూ శాఖ ప్రకటించాల్సిన నిర్ణయాలను హైడ్రా కమిషనర్ స్వయంగా ఎందుకు ప్రకటిస్తున్నట్టు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవిగో..
మంత్రి ప్రకటనకు భిన్నంగా..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గూల్ సర్వేనంబర్ 613లో (పాత సర్వేనంబర్ 119) సుమారు 374 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమిగా ఉన్నది. 22-ఏ నిషేధిత జాబితాలోనూ పొందుపరిచారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది ప్రభుత్వ భూమి అంటూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నది. సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయం వేదికగా అది ప్రభుత్వ భూమి అని మీడియా ముందు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో కార్పొరేట్ కంపెనీలు ఆ భూములను చెరబట్టాయి. చుట్టూ ప్రహరీ నిర్మించి హస్తగతం చేసుకున్నాయి. ఏడు దశాబ్దాలుగా అందులో సాగు చేసుకుంటున్న ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) రైతులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కానీ హైడ్రా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా అది ప్రైవేట్ భూమి అని బహిరంగంగా ప్రకటించారు.
రెవెన్యూ శాఖ మంత్రి దాన్ని ప్రభుత్వ భూమి అంటుంటే.. కమిషనర్ ప్రైవేట్ భూమిగా ఎలా నిర్ధారిస్తారు? ఈ క్షణం వరకు కూడా 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా ఎందుకు కాపాడటం లేదు? చుట్టూ ఫెన్సింగ్ ఎందుకు వేయడం లేదు? అది ప్రైవేట్ భూమి అని రంగారెడ్డి జిల్లా కలెక్టరే తనకు చెప్పారని రంగనాథ్ చెప్పారు. మరి కలెక్టర్ అధికారికంగా దానిని ప్రైవేట్ భూమి అని ఎందుకు ప్రకటించలేదు? రికార్డుల్లో ఎందుకు మార్చలేదు? ఆ భూములకు సంబంధించి కందుకూరు ఆర్డీవో సీలింగ్ ప్రక్రియను ప్రారంభించారని కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా ‘నమస్తే తెలంగాణ’కు స్పష్టంచేశారు. అమీన్పూర్లో సీలింగ్ ప్రక్రియ ముగియలేదని వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా అధికారులు నాదర్గుల్లోని భూమి జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెర వెనుక ప్రభుత్వ పెద్దలుంటే హైడ్రా అక్కడికి వెళ్లదా? అని నిలదీస్తున్నారు.
గుడిమల్కాపూర్‌లో రాజీకి యత్నం!
గుడిమల్కాపూర్‌లో టీఎస్ 6/1,16,27,28లో ఉన్న నాలా ప్రస్తుతం మనుగడలో లేదు. గతంలో ఉన్న బావి, నాలా క్రమక్రమంగా మనుగడ కోల్పోగా, దానికి కొంచెం ముందు డ్రైనేజీ నాలా నిర్మించారు. ఇదంతా 30 ఏండ్ల కిందట జరిగింది. అయితే నాలాను ఆక్రమించి మహావీర్ అనే నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రతినిధులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నిర్మాణాలు అక్రమమని తేల్చారు. ఆ తర్వాత అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. 18 నెలలు గడిచినా ఎలాంటి చర్యలూ లేవు. పాత అధికారులు మారారు. ప్రస్తుతం ఉన్న హైడ్రా అధికారులను అడిగితే రెవెన్యూ రిపోర్ట్ రావాలని, దానిని బట్టి తాము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ తర్వాత ఇరు వర్గాలను పిలిచి, రాజీ కుదిర్చేందుకు హైడ్రానే ప్రయత్నించినట్టు సమాచారం. నిర్మాణ సంస్థ వ్యక్తులు తమకు సంబంధించిన వ్యవహారాలు చూసే వ్యక్తి అందుబాటులో లేరనడంతో ఈ ముచ్చట వాయిదా వేశారు.
అత్తాపూర్‌లో సాకులు చూపి వెనుదిరిగి!
అత్తాపూర్‌లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ చెరువు ఉన్నది. దీనికి సంబంధించిన కోనేరును అనంతపద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు. సర్వేనంబర్ 365లో 6.02 గుంటల్లో విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు కొంతకాలంగా కొందరు ప్రయత్నిస్తున్నారు. అయినా హైడ్రా ఏమాత్రం స్పందించడం లేదు. చెరువు చుట్టూ కట్టను అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇస్తే, స్థానిక నేతలు కొందరు కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఆ పనులను అడ్డుకున్నారు. కుంటకు వేసిన కట్ట భారీ వర్షాలకు తెగిపోతే, అనంతపద్మనాభ స్వామి ఆలయంతోపాటు అందులోనే ఉన్న గోశాల పక్కనే ఉన్న పాండురంగానగర్, హుడా కాలనీలు మునిగిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుంటను కాపాడాలంటూ నిరుడు ఆగస్టులో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు వచ్చి కుంట విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నదంటూ సాకు చూపి వెనుదిరిగారు.
అల్మాస్‌గూడలో నోటీసులతో సరి!
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అల్మాస్గూడ పరిధిలో ఒక చెరువు పరిధిపై గతంలో హైడ్రా నోటీసులు జారీ చేసింది. సదరు భూ యజమాని పెట్రోల్ బంక్ కోసం తన భూమిని లీజుకు ఇవ్వగా, యాజమాన్యం అందులో పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఆ సమయంలో హైడ్రా అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందున నిర్మాణాలు నిలిపివేయాలని నోటీసు జారీ చేశారు. కొన్ని రోజులపాటు పనులు నిలిచిపోయాయి. కానీ ఆ తర్వాత పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తయి, అక్కడ బంక్ కొనసాగుతున్నది. మరి ఎఫ్టీఎల్ పరిధి అంటూ నోటీసు ఇచ్చిన హైడ్రా ఆ తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలే
బాలాపూర్ మండలపరిధిలోని సర్వేనంబర్ 99/1లోని రెండెకరాల ప్రభుత్వస్థలం ఆక్రమణకు గురవుతున్నదంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ స్థలానికి కూతవేటు దూరంలో ఎయిర్‌పోర్టు ఉండటంతో పెద్ద ఎత్తున భూముల ధరలు పెరిగాయి. దీంతో ఈ ప్రభుత్వ స్థలంలో చిన్నచిన్న షెడ్లు వేసి ఆక్రమణలు కొనసాగుతున్నాయి. వీటిపై గతంలో రెవెన్యూ అధికారులు నామమాత్రంగా రెండుమూడు చిన్న షెడ్లను కూల్చివేసి చేతులు దులుపుకొన్నారని, ఈ స్థలాన్ని పరిరక్షించాలంటూ హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. అంతకుముందే బాలాపూర్ మండల తహసీల్దార్ ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇందులో ఆక్రమణలకు సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించారు. ఈ ఆక్రమణలపై ఫిర్యాదు స్వీకరించిన అప్పటి హైడ్రా సీఐ తిరుమలేశ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కోర్టు కేసులున్నాయంటూ వెళ్లిపోయారు తప్ప సంబంధిత భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వచ్చిపోయిన హైడ్రా సిబ్బంది మాత్రం మళ్లీ ఆ వైపే చూడలేదని, హైడ్రా చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పెద్దగా ఫలితం లేదని స్థానికులు అంటున్నారు.
ఖాజాగూడ కబ్జాపై గప్‌చుప్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 27.18 ఎకరాల భూమిపై 80వ దశకం నుంచి కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నది. 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారి దానికి ఎన్వోసీ ఇచ్చారు. దాని ఆధారంగా ఒక నిర్మాణ కంపెనీ అక్కడ సుమారు 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. వాస్తవానికి అది ప్రభుత్వ భూమి. రెవెన్యూ రికార్డులే కాదు, అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా అది ప్రభుత్వ భూమి అని ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కానీ హైడ్రా మాత్రం తమకు ఎమ్మెల్యేలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నది. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్! సదరు నిర్మాణ సంస్థ యుద్ధపాత్రిపదికన నిర్మాణం పూర్తి చేసింది. ఇది రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కదా, ఎందుకు కాపాడరు? అని ప్రశ్నిస్తే.. తమకు ఫిర్యాదు అందలేదని హైడ్రా అంటున్నది. హైకోర్టు సూచించినా ఎమ్మెల్యేలు మాత్రం హైడ్రాకు ఫిర్యాదు చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అది అక్రమ నిర్మాణమని చెప్పారు. ఈ మేరకు కథనాలు కూడా వచ్చాయి. మరి ప్రభుత్వ భూములను కాపాడేందుకే ఏర్పాటైన హైడ్రా.. ఖాజాగూడ భూములపై ఎందుకు గప్‌చుప్‌గా ఉన్నది? ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏం ఫిర్యాదులు కావాలి? నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, హైడ్రా సమాధానాలు చెప్పకపోవచ్చు, కానీ ప్రజలు తెరవెనుక ఏం జరిగిందో గుర్తించలేని అమాయకులు కాదు కదా!\

అన్ని శాఖలను బైపాస్ చేసి హైడ్రా పెత్తనం
హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలు చూస్తుంటే మాటలు చాలడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి, పెత్తనం చెలాయిస్తున్నది. ప్రభుత్వ చట్టాలతో పనిలేకుండా హైడ్రానే అన్నీ చేస్తున్నది. చేయాలి అనుకుంటే మిగిలిన అన్ని ప్రభుత్వశాఖలు ఎందుకు? ఆయా చట్టాలను రద్దు చేసి హైడ్రానే చట్టంగా చేస్తే సరిపోతుంది. హైడ్రా కమిషనర్ ఎక్కడికి వెళ్లినా పదికి పైగా వాహనాల్లో ఎలా వెళ్తున్నారు? జేసీబీలు, వాహనాలు వంటివి ఎక్కడినుంచి వస్తున్నాయి. అసలు జీవో 99 ప్రకారం ఆయనకు ఇచ్చిన సౌకర్యాలేంటి? ప్రజల మనస్సుల్లో హైడ్రా భయాన్ని సృష్టిస్తున్నది. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శిస్తున్నది. 40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి. కానీ హైడ్రా వారిని కనీసం తాకదు. కారణం అందరికీ తెలిసిందే.
-హైకోర్టు జస్టిస్ అనిల్‌కుమార్ వ్యాఖ్యలు (ఈనెల 24న హైడ్రాపై కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంలో)
ఈ ఫిర్యాదులపై చర్యలెక్కడ?
హైడ్రాకు ఇప్పటివరకు పదివేల వరకు ఫిర్యాదులు అందినట్టు కమిషనర్ రంగనాథ్ చాలాసార్లు మీడియాకు వెల్లడించారు. వీటిని పరిష్కరించడానికి తమ బృందం ఎప్పటికప్పుడు పనిచేస్తున్నదని చెప్పారు. ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్న వెంటనే వాటిపై విచారించి, సంబంధిత ఏరియా అధికారికి కేటాయించి, రెండు మూడురోజుల్లోగా కొలిక్కి తీసుకురావాలని చెప్తున్నట్టు హైడ్రా అధికారి ఒకరు చెప్పారు. కానీ కొన్ని ఫిర్యాదులు నెలల తరబడి, మరికొన్ని ఏకంగా సంవత్సరకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై చర్యలు లేకపోగా చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బాలాపూర్‌లో తహసీల్దార్ ఫిర్యాదు చేసినా..
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ బాలాపూర్ గ్రామంలో సర్వేనంబర్ 74లో ఆక్రమణలు జరిగాయంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి 3.06 ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేశారంటూ నిరుడు డిసెంబర్లో ఫిర్యాదు చేయగా, దీనిపై నివేదిక కావాలంటూ బాలాపూర్ తహసీల్దార్‌ను హైడ్రా అధికారులు కోరారు. జనవరి 6న బాలాపూర్ తహసీల్దార్ స్పష్టంగా ప్రభుత్వ భూమిని సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి, సింగిరెడ్డి దయాకర్‌రెడ్డి, సుచిత్రారెడ్డి ఆక్రమించుకున్నారని, అక్కడ షెడ్లు వేసుకున్నారని హైడ్రా కమిషనర్‌కు లేఖ రాశారు. ఇవి పూర్తిగా ఆక్రమణలని వీటిని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి తొలగించాలని అందులో సూచించారు. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కూడా హైడ్రా అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు? పేదోడు గజం భూమిలో చిన్న గుడిసె వేసుకుంటేనే హైడ్రా రాత్రికిరాత్రి వెళ్లి బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి స్వయానా తహసీల్దార్ ఫిర్యాదు చేసినా ఆ కబ్జా జోలికి ఎందుకు వెళ్లడం లేదు?

ఆ కారణం అందరికీ తెలుసు
హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలు చూస్తుంటే మాటలు చాలడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి, పెత్తనం చెలాయిస్తున్నది. ప్రభుత్వ చట్టాలతో పనిలేకుండా హైడ్రానే అన్నీ చేస్తున్నది. ప్రజల మనస్సుల్లో భయాన్ని సృష్టిస్తున్నది. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శిస్తున్నది. 40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి. కానీ హైడ్రా వారిని కనీసం తాకదు. కారణం అందరికీ తెలిసిందే.
-ఈనెల 24న హైడ్రాపై కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జస్టిస్ అనిల్‌కుమార్ వ్యాఖ్యలు

జియాగూడలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన భూమిలో ఓ కంపెనీ బిల్డర్స్ చేపట్టిన భారీ భవనాల నిర్మాణం