మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 10 : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, సరికొత్త బహుజన రాజ్యం స్థాపించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన వ్యక్తి, పేద ప్రజల దేవుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పండుగ సాయన్న పేద ప్రజల పక్షాన నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడన్నారు. ఆ రోజుల్లో పెత్తందారులు,దేశ్ముఖ్లు, కరణం పటేల్, భూస్వాములు స్వైర విహారం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇవన్నీ చూసి తట్టుకోలేని సాయన్న ఒక దళాన్ని ఏర్పాటు చేసుకుని భూస్వాములపై దాడి చేసి, గోదాములు పగలగొట్టి ధాన్యం బస్తాలు బయటకు తెచ్చి పేదలకు పంచినట్లు తెలిపారు.
దీంతో కొందరు భూస్వాములు అతడిపై బందిపోటు ముద్రవేసి చంపేసినట్లు చెప్పారు. పండుగ సాయన్న జయంతిని -వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే పండుగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలన్నారు సాయన్న ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, బీసీ యువజన నాయకులు బంటు సైదులు, భాషం శ్రీనివాస్, రవితేజ, గణేశ్, శివ, వంశీ, హరి, శంకర్, ముని, శివతేజ, రవీందర్, వినయ్, విక్రమ్ పాల్గొన్నారు.