రామవరం, డిసెంబర్ 10 : వీకే సీఎం కోల్ మైన్‌లో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు నిర్వహించాలని, సత్తుపల్లికి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్‌కు తీసుకురావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ అన్నారు. బుధవారం వెంకటేష్ గని కోల్ మైన్‌లో కాపుకృష్ణ ఆధ్వర్యంలో గని అడిషనల్ మేనేజర్ అనిల్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మికులకు అబద్ధపు మాటలు చెప్పి గెలిచిన రెండు యూనియన్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మరచి ట్రాన్స్ఫర్స్, డిప్యూటేషన్, పైరవీలకు పరిమితం అయ్యాయన్నారు. గత వంద సంవత్సరాల నుండి సింగరేణి ద్వారా కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు చేస్తన్నారని, కొత్తగా ప్రారంభమైన వెంకటేష్ కోల్ మైన్ లో బొగ్గును ప్రెవేట్ వారితో తవ్వకాలు చేయడం కోసం సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందన్నారు.
ప్రైవేట్‌కు అప్పజెప్పడం వల్ల కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయన్నారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో పివికే మైన్ కూడా మూత పడుతుందని, వికే కోల్ మైన్‌ను సింగరేణి కార్మికులతో నడిపితే పీవీకే వాళ్లందర్నీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. గతంలో మాదిరిగా మెడికల్ బోర్డు నిర్వహించి బోర్డుకు పోయిన వారందరిని అన్‌ఫిట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్, పిట్ సెక్రటరిలు జిఎస్ శ్రీనివాసరావు, ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీ రాజ్ కుమార్, సంతోష్, వెంకటేశ్, కోటేశ్వరరావు, ప్రకాశ్, సిఐటియు నాయకులు శ్రీరామ్ మూర్తి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

Ramavaram : ‘సత్తుపల్లికి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారిని వెంటనే వీకే కోల్ మైన్‌కు తీసుకురావాలి’