గత ఏడాది ‘వార్ 2’తో పానిండియా ఆడియన్స్‌ని పలకరించిన హృతిక్ రోషన్.. తర్వాతి ప్రాజెక్ట్‌గా స్వీయ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్తుందా అని ఎదురు చూసిన హృతిక్ అభిమానులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. కారణం.. హృతిక్ ప్రస్తుతానికి ‘క్రిష్ 4’ను పక్కనపెట్టారట. దానికంటే ముందు మరో ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలని ఆయన నిశ్చయించారట.
ఆ వివరాల్లోకెళ్తే. కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు హృతిక్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ చేయనున్న తొలి సౌతిండియా సినిమా కావడం విశేషం. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే ‘క్రిష్ 4’ని పట్టాలెక్కించాలని హృతిక్ భావిస్తున్నారట. ఇక హోంబలే వారితో హృతిక్ చేయబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.