హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ పోలీస్ కమిషనర్(సీపీ) గౌస్ ఆలం ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పోలీస్ డిపార్టుమెంట్‌కు చెందిన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఒక పౌరుడి అవసరాల కోసం ఎనిమిది నెలల నుంచి హైదరాబాద్‌లో వినియోగిస్తున్నారని ఆరోపించారు. అలాగే మరో ఇన్నోవాను సీపీ తన సోదరుడి సొంత అవసరాల కోసం వాడుతున్నారని విమర్శించారు. సీపీ సతీమణి అవసరాల కోసం కూడా ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్నారని, ఆమెకు తోడుగా ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా పంపిస్తున్నారని ఆరోపించారు.
సీపీ జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని, పీడీఎస్ బియ్యంలో అక్రమాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఏసీపీ, సీఐతో డబ్బులు వసూలు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు వసూల్ చేయనందుకు ఇటీవల ఓ ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారని వెల్లడించారు. అలాగే ఓ మాల్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.25 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ‘తాను చెప్పిన విషయాలు అబద్ధం అయితే ముక్కు నేలకు రాస్తా’ అని చెప్పారు. మాజీ మంత్రికి, మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు లేరు కానీ, సీపీకి మాత్రం ఎస్కార్ట్ వాహనాలతోపాటు 2+2 చొప్పున నలుగురు గన్మెన్లను పెట్టుకున్నాడని విమర్శించారు. సీపీ అధికార దుర్వినియోగంపై డీజీపీ స్పందించి, చర్యలు చేపట్టకపోతే, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్రమాల వీడియోలు బయటపెడుతానని హెచ్చరించారు.