ఎదులాపురం, ఆగస్టు 9 : ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్‌తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 10వరకు చేపట్టనున్న ఈ దీక్షలో తొలిరోజు భూనిర్వాసితులు కూర్చున్నారు.
జోగు రామన్న వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ దీక్షలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్ నారాయణ, నాయకులు సాజీదుద్దీన్, బండి దత్తాత్రి, కిరణ్, అజయ్, రమేశ్ పాల్గొన్నారు.